అపరిచితుడి డిల్లీలో దీక్ష, ర్యాలీ

 

విభజన బిల్లుని శాసనసభలో తిరస్కరింపజేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరువాత ఏమి చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయవచ్చని, లేదా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీ, యం.యల్యే, మంత్రులందరినీ వెంటబెట్టుకొని రాజ్ ఘాట్ నుండి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసి రాష్ట్రపతికి తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతించవద్దని విజ్ఞప్తి పత్రం ఇవ్వవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల నాలుగున కీలకమయిన కేంద్రమంత్రుల బృందం సమావేశం, ఆ మరునాడే పార్లమెంటు సమావేశాలు మొదలవనున్నాయి. గనుక ఆయన అదే సమయంలో తన దీక్ష లేదా పాదయాత్ర చెప్పట్టవచ్చని ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న లగడపాటి రాజగోపాల్ కూడా ద్రువీకరించడంతో ముఖ్యమంత్రి డిల్లీలో హంగామా చేయబోతున్నారని స్పష్టం అవుతోంది.

 

అయితే కొద్ది రోజుల క్రితమే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రులు, పార్టీ సభ్యులతో కలిసి ఐదుగురు పోలీసు అధికారులపై హోంశాఖ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిపిన ముప్పై గంటల దీక్షకు అనుమతించినందుకు సుప్రీం కోర్టు డిల్లీ పోలీసులను చివాట్లు పెట్టడమే కాకుండా చట్టాన్ని కాపాడవలసిన ముఖ్యమంత్రే స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. అందువల్ల మరిప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ డిల్లీలో దీక్షలు, ర్యాలీలు నిర్వహించేందుకు డిల్లీ పోలీసులు అంగీకరిస్తారా? అనుమతిస్తే సుప్రీం కోర్టు ఏవిధంగా స్పందిస్తుంది?

 

పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టే తరుణంలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి దానిని నిరసిస్తూ డిల్లీలో దీక్షలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే అది కాంగ్రెస్ అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా అవమానకరమే కాక చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పిస్తుంది. అందువల్ల హోంశాఖ ఆయన దీక్షలకి, ర్యాలీలకు అనుమతిస్తుందా? ఈయకపోతే అప్పుడు ఆయన హైదరాబాదులో దీక్షకు కూర్చోంటారా? లేక మరేవిధంగా స్పందిస్తారు? అనేది మరో రెండు మూడు రోజులలో తేలిపోవచ్చును.

 

ఒకవైపు పార్టీ నిలబెట్టిన రాజ్యసభ అభ్యర్ధులను గెలిపించుకోనేందుకు తీవ్రంగా కృషి చేస్తూ పార్టీపట్ల వీరవిధేయత చూపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు పార్టీని ఇరుకునబెట్టేవిధంగా డిల్లీలో దీక్షలు ర్యాలీలు చెప్పట్టాలనుకోవడంతో ఆయన ఎవరికీ అర్ధం కాని ఒక అపరిచితుడివలే కనబడుతున్నారు.