సోనియాను వెనుకేసుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి

 

నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడబోతున్నట్లు చెప్పబడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు శాసనసభలో తెదేపా నేత పయ్యావుల కేశవ్ సోనియా గాంధీ విదేశీ పౌరసత్వం గురించి విమర్శిస్తున్నపుడు, ఆమె భజనలో తరిస్తున్న టీ-కాంగ్రెస్ నేతల కంటే ముందుగా లేచి ఆమెకు మద్దతుగా మాట్లాడటం విశేషం. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉందని సుప్రీం కోర్టే ద్రువీకరించిందని, అందువల్లే ఆమె యంపీగా, పార్టీ అధ్యక్షురాలిగా, యూపీయే చెయిర్ పర్సన్ గా కొనసాగుతున్నారని అన్నారు. ఆమె తనకు ప్రధానమంత్రి పదవి చెప్పట్టే అవకాశం ఉన్నపటికీ, ఆమె వద్దనుకొనడం వలననే పీవీ నరసింహరావు ప్రధాని కాగలిగారని అన్నారు.

 

రాష్ట్ర విభజన అంశంపై మొదటి నుండి ఆమెతో విభేదిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నడూ కూడా నేరుగా ఆమె పేరు ఎత్తకుండానే అధిష్టానం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నఈ సమయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆమెపై అచంచల విశ్వాసం చూపడం విశేషమే. బహుశః అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అత్యంత విదేయుడయిన, క్రమశిక్షణ గల నేత అని దిగ్విజయ్ సింగ్ సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. అదే నిజమయితే, త్వరలో కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోతున్న కొత్త రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ కోసమే పుట్టబోతునట్లు అర్ధమవుతుంది.