టీ-బిల్లుని సాగనంపిన తరువాత కార్యాచరణ!

 

తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు వీరోచితంగా పోరాడేసి అడ్డుకొంటామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, ఏపీయన్జీవోల నాయకుడు అశోక్ బాబు అందరూ కూడా బిల్లు రాగానే ఎందుకో అకస్మాత్తుగా చల్లబడిపోయారు. బిల్లుతో బాటు హైదరాబాదుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ బహుశః ముఖ్యమంత్రిని చల్లబరిస్తే, ఆయన తన అనుచరులను అశోక్ బాబును చల్లబరిచారేమో! ఏమయినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటికీ కూడా రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొంటానని పలవరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా అశోక్ బాబు కూడా వారం వర్జ్యం అన్నీ చూసుకొని మళ్ళీ సమ్మె మొదలుపెడతామని హెచ్చరిస్తూనే ఉన్నారు.

 

ఇక తాజా వార్త ఏమిటంటే, బిల్లుని శాసనసభలో అడ్డుకోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని, అందువల్ల జనవరి 23నో లేక ఇంకా ముందుగానో బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపేసిన తరువాత, అందరూ ఒక సమావేశం ఏర్పరచుకొని సమైక్యాంధ్ర కోసం ఏవిధంగా పోరాడాలో నిశ్చయించుకొందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది.

 

ఒకవేళ అప్పుడు కూడా కుదరకపోయినట్లయితే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాతనో లేకపోతే పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్రవేసిన తరువాతనో ఆ సమావేశామేదో పెట్టుకొంటే ఇంకా బాగుంటుందేమో ఆలోచిస్తే బాగుటుంది కదా!