సీమాంధ్ర ప్రజలకు సీయం హ్యాండ్

 

“ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ప్రభుత్వాలకు ప్రజలే శలవులు ప్రకటిస్తారు. ఆఖరు బంతి వరకు ఆట సాగుతుంది. దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతమయినవి. నేను నేటికీ సమైఖ్యవాదానికే కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయంలో, ఆలోచనలలో వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. నేను పైలిన్ తుఫానును ఆపలేకపోవచ్చునేమో కానీ, తప్పకుండా రాష్ట్ర విభజన ఆపగలను. నాచేతులతో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభిచే అదృష్టం దక్కినందుకు గర్వ పడుతున్నాను. కానీ, నా హయాంలోనే రాష్ట్ర విభజన జరగడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇన్ని నెలలుగా రోడ్లమీధకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తుంటే ప్రపంచమంతా గమనించింది. కానీ ఇది గమనించడానికి కేంద్రానికి కళ్ళు చెవులూ లేవా? ఇటువంటి పదునయిన మాటలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకాలంగా అధిష్టానాన్ని గట్టిగా ఎదిరిస్తూ, సమైక్య చాంపియన్ గా మంచి పేరు సంపాదించుకొన్నారు. అయితే ఇప్పుడు అదంతా కంటశోషగా మిగిలిపోయినట్లు కనబడుతోంది.

 

టీ-బిల్లు శాసనసభకు రాగానే రాష్ట్రంలో ప్రళయం వచ్చేస్తుందనే అంతగా ఆయన అనుచరులు అందరూ కూడా చల్లబడిపోయారు. చివరికి ముఖ్యమంత్రి కనుసైగతో రంగంలో దూకేసే ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు మెరుపు సమ్మె చేయాడానికి సరయిన ముహూర్తం దొరక్కపోవడంతో మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోవలసి వచ్చింది పాపం.

 

ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో తెలంగాణా బిల్లుపై వీర ప్రసంగం చేసేసిన తరువాత ఆయన అయన సహచరులు వీరతిలకం, వీర గంధం ఒళ్లంతా పూసేసుకొని రాజీనామాలు చేసేసి వీధుల్లోకి వచ్చేసి ఆందోళనలు చేసేస్తారని ప్రజలెవరూ కూడా ఇక ఆందోళన చెందనవసరం లేదు.

 

అయితే ఆరు నెలలుగా గారడి సాము చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం శాసనసభలో విభజనకు వ్యతిరేఖంగా నాలుగు మంచి మాటలయినా చెపితే విని పులకించిపోదామని టీవీలకు చెవులు కళ్ళు అప్పగించి కూర్చొన్న ప్రజల ఆశలను అడియాస చేస్తూ, ఈ రోజు ఆయన శాసనమండలిలో మొక్కుబడిగా మూడే మూడు నిమిషాలాలో ఆ తంతు కూడా ముగించేసారు.

 

బీహార్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడి శాసనసభ అనుసరించిన పద్దతులని తాను అధ్యయనం చేసానని, అందువల్ల సభలో సభ్యులందరూ కూడా అధ్యయనం చేస్తే మేలని ఒక ఉచిత సలహా ఇచ్చారు. సభ ముందుకు వచ్చిన సమస్య చాలా సున్నితమయినది కనుక, సభ్యులందరూ సంయమనం పాటించాలని కోరారు. చర్చల ద్వారా ఎటువంటి సమస్యనయినా పరిష్కరించు కోవచ్చు గనుక దీనిపై సభలో సభ్యులందరూ హుందాగా చర్చలో పాల్గొని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అందుకోసం స్పీకర్ , చైర్మన్ ఇరువురూ సభకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అవసరమయితే మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొనైనా ఉభయ సభలు సజావుగా సాగేలా చేయడం మన అందరి భాద్యత అని ఆయన హితబోధ చేసారు. ఆ తరువాత సభలో సమైక్యాంధ్ర నినాదాలు మొదలవడంతో సభ వాయిదా పడింది.

 

ఇక శాసనసభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవదికంగా వాయిదా వేసారు. అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలు ఉభయ సభల నుండి ఏమీ ఆశించడం అత్యాస, అడియాసే అవుతుందనే సత్యం ఎంత త్వరగా గ్రహిస్తే అంతే మన శాంతి దక్కుతుంది.