నేడే ముఖ్యమంత్రి రంగప్రవేశం


 

గత నాలుగయిదు నెలలుగా అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెడుతున్నసమయంలో అనారోగ్యకారణంతో సభకు డుమ్మాకొట్టడంతో ఆయన తీవ్ర విమర్షలకు గురయ్యారు. అయితే ఆయన నిన్నసాయంత్రం సమైక్యవాదం చేస్తున్న కొందరు సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులతో సమావేశమయ్యారు. అయన తన వద్ద ఉన్న బిల్లుకాపీని వారికి చదివి వినిపించి, దానిని ఈ రోజు స్వయంగా సభలో ప్రవేశపెడతానని, అందులో ప్రతీ ఆర్టికల్ పై వోటింగ్ కోరుతానని తెలిపారు. ఆర్టికల్ 371(డీ) సవరించనిదే విభజన అసాధ్యమనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. బిల్లుపై సభ ఎప్పుడు, ఎన్ని రోజుల పాటు చర్చించాలో బిజినస్ అడ్వయిజరీ కమిటీయే నిర్ణయం తీసుకొంటుందని ఆయన తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.

 

ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా సాగుతున్న సభాసమావేశాలు ముఖ్యమంత్రి రాకతో మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. నిన్న శాసనమండలి ప్రాంగణంలో మీడియా పాయింటు వద్ద తెదేపా, తెరాస యం.యల్.సీ.లు కొట్టుకొనేంత వరకు వెళ్ళారు. ఉభయ సభలు నినాదాలతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నటీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఈరోజు ఆయనపై మూకుమ్మడిగా విమర్శలకు దిగే అవకాశం ఉంది. అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఆయనకు బాసటగా నిలిచి ఎదురుదాడికి దిగితే సభలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు.