వరదరాజస్వామి దర్శనానికి కేసీఆర్.. రోజాతో భేటీ రాజకీయమా?

 

సీఎం కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ ఏడాది ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయంలో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తొక్కిసలాటలో భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మళ్ళీ 40 ఏళ్ళ వరకు స్వామిని చూసే అవకాశం లేకపోవడం, మనిషి జీవితం మొత్తం మీద ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ స్వామి దర్శనం అయ్యే అవకాశం లేకపోవడంతో భక్తులు ఎగబడుతున్నారు. ఆ భక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. మొదట్నుంచి కేసీఆర్ కి పూజలు, దేవాలయాలపై మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరదరాజస్వామి దర్శనానికి పయనమయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వరదరాజ స్వామి దర్శనంతో పాటు ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజాతో భేటీ కూడా కానున్నారని తెలుస్తోంది.

సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు. వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం రోజా ఇంట్లోనే అని తెలుస్తోంది. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయట. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రోజా ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రోజాకి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రోజా దాని గురించి కేసీఆర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది.