TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు.. మరి, భయమెందుకు గులాబీ బాస్? 

Published on: Mon Feb 8, 2021 5:12PM

తెలంగాణలో కొత్త పార్టీల ప్రస్థానంపై జోరుగా చర్చ. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలతో మరింత ఆసక్తి. అసలు వస్తాయో రావో తెలీని.. ఇంత వరకూ ఎలాంటి స్పష్టత లేని.. కొత్త పార్టీల ఏర్పాటుపై సీఎం స్థాయిలో స్పందన వచ్చిందంటే.. తెర వెనుక ఏదో జరుగుతోందనేగా..? అదేంటి? నడుస్తున్న కాలం మీద.. కొత్త పార్టీ పొద్దు పొడుస్తుందా? కొత్త నీటితో.. పాత పార్టీలు రోత పుట్టించడం ఖాయమా? అదే జరిగితే.. ఎవరి అధికారినికి ఎసరు? ఏ పార్టీకి లాభం? ఎవరికి నష్టం?

కేసీఆర్ కామెంట్లు తెలంగాణలో కాక రేపుతున్నాయి. కొత్త పార్టీలపై ఇంకా ప్రజల్లో చర్చ మొదలవకుండానే.. సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కాస్త పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక వర్గం ప్రజల్లో మాత్రమే కొత్త పార్టీలు రాబోతున్నాయనే టాక్ నడుస్తోంది. ఇంకా సామాన్య ఓటర్లకు ఆ పార్టీలు ఏంటో.. అవి ఎవరి నేతృత్వంలో వస్తున్నాయో అనే దానిపై ఏ మాత్రం ఐడియా లేదు. ఇంకా ఆలూ-సూలూ లేకుండానే.. పార్టీలపై స్పందించాల్సిన అవసరం గులాబీ బాస్ కు ఏమొచ్చిందనే అనుమానం అందరిలోనూ వినిపిస్తోంది. 

షర్మిలకేనా ఆ సెటైర్లు?
కొత్త పార్టీల రేసులో అందరికన్నా ప్రముఖంగా వినిపిస్తోంది ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పేరు. వైఎస్సార్ సీపీ సిస్టర్ పార్టీ త్వరలోనే తెలంగాణలో అరంగేట్రం చేయబోతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏర్పాట్లో షర్మిల నిమగ్నమయ్యారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను.. జగన్ ఫ్యాన్స్ ను, పాత కాంగ్రెస్ కేడర్ ను.. ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేసి.. ఏకీకృతం చేసేలా.. షర్మిల అడుగులు వేస్తున్నారని అంటున్నారు. నీళ్ల పంచాయితీలో జగన్ కు, కేసీఆర్ కు రిలేషన్ చెడిందని చెబుతున్నారు. హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉన్న జగన్.. తెలంగాణలో బలంగా లేకపోతే కేసీఆర్ తో ఎప్పటికైనా ప్రమాదమేనని అంచనా వేస్తున్నారని.. అందుకే ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు షర్మిల రూపంలో బాణం వదులుతున్నారని విశ్లేషిస్తున్నారు. షర్మిల పార్టీతో తమకు ఇప్పటివరకు మద్దతుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే భయంలో టీఆర్ఎస్ అధినేత ఉన్నారంటున్నారు. అందుకే జగనన్న వదులుతున్న బాణానికే గులాబీ బాస్ ఇంతలా కంగారెత్తి.. అంతటి మాట మాట్లాడారా అని అనుమానిస్తున్నారు. 

రేవంత్ రెడ్డినే టార్గెటా? 
ఇక షర్మిలతో పాటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం హస్తానికి హ్యాండ్ ఇచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్లతో ఇక నెగ్గలేనని.. పీసీసీ చీఫ్ పదవి 
దక్కించుకోడానికే ఇంత కష్టమవుతుంటే.. ఇక భవిష్యత్ లో సీఎం పోస్టుకు ఇంకెన్ని ఆటంకాలు వస్తాయోనని విసిగెత్తిపోయారని అంటున్నారు. అందుకే.. కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటితో సత్తా చాటేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పెట్టబోయే పార్టీపైనే కేసీఆర్ అలాంటి కామెంట్లు చేశారనే ప్రచారమూ జరుగుతోంది. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి మామూలోడు కాదు. ఆయన మరొకరి నాయకత్వంలో పని చేస్తూనే.. ఇంత దూకుడుగా రాజకీయం చేస్తుంటే.. ఇక సొంత పార్టీ పెడితే.. రేవంత్ జోరుకు అద్దూఅదుపు ఉంటుందా? రేసుగుర్రంలా పరిగెత్తే ఫైర్ బ్రాండ్ లీడర్ ను తట్టుకోవడం కేసీఆర్ కు సాధ్యమా? అందుకే.. కొత్త పార్టీల ఏర్పాటు అంత ఈజీనా? అంటూ ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నంలో తనలోని భయాన్ని బయటపెట్టుకున్నారంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్. 

కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే..!
కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారానికి స్వస్తి పలుకుతూ.. తానే మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పుకొచ్చారు కేసీఆర్. ఆ సందర్భంలోనే కొత్త పార్టీ ఏర్పాటు, వాటి ఇబ్బందులపు నేతల ముందు ప్రస్తావించారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ లు పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? అంటూ గుర్తు చేశారు. అయితే.. కేసీఆర్ కామెంట్స్ పై అప్పుడే కౌంటర్లు కూడా పడుతున్నాయి. నరేంద్ర, విజయశాంతిల పార్టీలను కబ్జా చేసింది తమరే కదా అని గులాబీ బాస్ కు గుర్తు చేస్తున్నారు తెలంగాణ వాదులు. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని కేసీఆర్ ఆ మీటింగ్ లో గొప్పగా ప్రకటించారు. ఆ మాట నిజమే కావొచ్చు కానీ.. టీఆర్ఎస్ లానే.. షర్మిల పార్టీనో.. రేవంత్ రెడ్డి పార్టీనో.. ప్రభంజనం స్పష్టిస్తే.. టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అందుకేనా గులాబీ బాస్ లో అంత భయం? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. ఏమో.. ఎవరు చెప్పగలరు.. గుర్రం ఎగరావచ్చు...