అసెంబ్లీ సాక్షిగా వైఎస్ ని ప్రశంసించిన కేసీఆర్!!

 

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసిచారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం 10 రోజుల్లో అందుతోందని చెప్పారు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్లే పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోయలు వలస రావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని చెప్పారు.

ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సాహసం చేయబోతోందని కేసీఆర్‌ చెప్పారు. గతంలో సర్వే ప్రకారం 8 లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. ఇల్లు అవసరమైనవాళ్లు ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలను త్వరలో తీస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఇళ్ల పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొంచెం ఆలస్యమైనా తాము డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నాణ్యంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పేదవాళ్ల పేర్లను లాటరీలో వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ లాటరీ విధానానికి మినహాయింపు లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 30వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్ఎస్ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు. ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్రం వాటా పైసా కూడా లేదని స్పష్టం చేశారు.

కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన పన్నువాటా తప్ప నిధులు రాలేదని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆదాయ, వ్యయాల అంచానా రూ.10 లక్షల కోట్లని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ.2 లక్షల 40 వేల కోట్లని, అప్పు చెల్లిస్తే మళ్లీ రూ.లక్షా 30వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ అన్నారు. 12,751 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని అన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.