ప్రతిగింజా మేమే కొంటాం.. రాష్ట్రాలను దివాళ తీయించేలా RSS కుట్ర..
Published on: Tue Apr 12, 2022 7:09PM
యాసంగి ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటాం. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున మేమే తీసుకుంటాం. ఇందుకోసం ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ధాన్యం కొనుగోలు చేసి మూడు, నాలుగు రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేంద్రంపై ఎప్పటిలానే సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులను దగా చేస్తూ.. కేంద్రం వరి కొనుగోలుకు మొండిచేయి చూపుతోందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని, రైతులను జీతగాళ్లగా మార్చాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు.
రాష్ట్రాలను దివాళ తీయించేలా.. కేంద్రాన్ని బలోపేతం చేసేలా.. ఆర్ఎస్ఎస్ విధానం మేరకు దిక్కుమాలిన సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ వాళ్లది నోరా-మోరా అంటూ విమర్శించారు.


