మండలి పోరులో కమ్యూనిస్టులు.. కేసీఆర్ నయా ప్లాన్! 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట అంటుంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలా,,, తనకు అనుకూలంగా లేనప్పుడు మరోలా ఆయన అడుగులు వేస్తుంటారు. అవసరమైతే పూర్తి భిన్నమైన వైఖరులు కూడా తీసుకుంటారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే కేసీఆర్ కు మాటమీద నిలబడరనే ఆరోపణలున్నాయి. అవేమి పట్టించుకోని కేసీఆర్.. తాను అనుకున్నది సాధించేందుకు వెనక్కి తగ్గరనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే తరహా కొత్త ఎత్తులు వేస్తున్నారు. 

 

కేసీఆర్ సర్కార్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు వీరే. అందుకే మండలి ఎన్నికలు కారు పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. పార్టీ పరిస్థితిని అంచనా వేసిన గులాబీ బాస్ మండలి ఎన్నికల్లో గెలుపు కోసం మరో స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు వెళ్లకుండా, చీలిపోయేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు మండలి బరిలో ఉండేలా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ప్లాన్ లో భాగంగానే మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ తో కలిసి కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా కోదండరామ్ తో కలిసి పలు ఉద్యమాలు చేశారు. వామపక్ష పోరాట కార్యక్రమాలకు కోదండరామ్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నారు కమ్యూనిస్టు నేతలు. టీజేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, ఇంతకాలం తమ ఉద్యమాలకు మద్దతుగా  కోదండరామ్ ఎమ్మెల్సీ బరిలో ఉంటుంటే మాత్రం ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. కోదండరామ్ కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధికారికంగా లేఖలు రాసినా కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదని సమాచారం. 

 

శాసనమండలి ఎన్నికలో పోటీ చేయబోతున్న కోదండరామ్ కు వామపక్షాలు సపోర్ట్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామపక్షాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. గత పట్టభద్రుల మండలి ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు పోటీలో ఉంటున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసీఆర్ చెప్పడం వల్లే మండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, కోదండరామ్ తో పాటు వామపక్ష అభ్యర్థి, పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుందని, అంతిమంగా అది అధికార పార్టీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే కేసీఆర్ డైరెక్టుగా వారితో పొత్తు పెట్టుకోకుండా.. మండలి ఎన్నికల్లో మరో దారిలో వస్తున్నారని చెబుతున్నారు. 

 

అసెంబ్లీ సమావేశం సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడటానికే చాడాను కేసీఆర్ పిలిపించినట్లు అప్పుడే ప్రచారం జరిగింది. కాని సీపీఐ నేతలు మాత్రం ఖండించారు. కొత్త రెవిన్యూ చట్టం గురించే చాడాతో ముఖ్యమంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎన్నికల గురించే కేసీఆర్ సీపీఐ నేతతో మాట్లాడినట్లు అంతా అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపైనా కమ్యూనిస్టులు ఇంకా తమ వైఖరిని ప్రకటించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దుబ్బాకలోనూ అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వొచ్చని చెబుతున్నారు.