TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇవాళ ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్... మరో ఛాన్సిచ్చేందుకు కేసీఆర్ యోచన

Published on: Wed Oct 9, 2019 11:10AM

 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఉద్యోగాలు ఊడిపోయాయంటూ బెదిరింపులకు దిగుతున్నా, కార్మికులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. దాంతో మెజారిటీ బస్సులన్నీ డిపోలకే పరిమితమవుతున్నారు. ఇక సమ్మె ఐదో రోజుకి చేరడంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే, విపక్షాల మద్దతు కూడగట్టిన ఆర్టీసీ కార్మిక జేఏసీ...తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుపునిచ్చింది. అలాగే, తమ సమ్మెకు మద్దతివ్వాలని అన్ని పార్టీలను, ఉద్యోగ, ప్రజాసంఘాలను కోరింది.

ఒకవైపు ఆర్టీసీ కార్మికులు పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతుంటే.... మరోవైపు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని మరోసారి పిలుపునివ్వాలని కోరనున్నట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇక, కేసీఆర్ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకే కార్మికులపై సీఎం కేసీఆర్ వేటు వేశారని బీజేపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఏ కొలువుల కోసం ప్రత్యేక రాష్ట్రం పోరాటం జరిగిందో ఆ కొలువులనే ఇప్పుడు కేసీఆర్ తొలగిస్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లేనన్న కేసీఆర్... ఇప్పుడు అదే అగ్గితో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరించారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ పై మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ చెప్పడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమంటూ భట్టి ఫైరయ్యారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాలు అండగా ఉండాలని భట్టి పిలుపునిచ్చారు.