హరీష్ రావుకి మంత్రి పదవి.. కానీ, నీటిపారుదల కాదు!!
Published on: Thu Jun 27, 2019 11:33AM

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై మొదటి వారంలో ఆరు కీలక మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు గతంలో నిర్వహించిన ఐటీ శాఖనే కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. హరీష్ రావుకు మాత్రం గతంలో ఆయన నిర్వహించిన భారీ నీటిపారుదల శాఖకు బదులుగా విద్యా శాఖ కేటాయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి వేరే శాఖ కేటాయించే అవకాశముంది.
అయితే.. గత కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేదని సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో విమర్శలకు తావివ్వకుండా కేబినెట్‌లో ఈసారి మహిళకి చోటు కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. గతంలో హోంమంత్రిగా పనిచేసిన అనుభవమున్న సబితాకు.. కేసీఆర్ ఏ శాఖ కేటాయిస్తారో చూడాలి.


