ఐదు జిల్లాల స్వప్నం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్ ‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను చినజీయర్‌స్వామితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. 

అంతకముందు కొండపోచమ్మ ఆలయంలో ఉదయం వైభవంగా చండీయాగం నిర్వహించారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ యాగం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతో పాటు చినజీయర్ స్వామీ కూడా పాల్గొన్నారు.

కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంతో.. ఐదు జిల్లాల స్వప్నం సాకారమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ఆ తర్వాత అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడంతో గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మకు చేరుకుంటాయి.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో ఐదుజిల్లాలో మొత్తం 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.