కేసీఆర్‌కు యశోదలో వైద్య పరీక్షలు! కరోనా లక్షణాలు లేవన్న డాక్టర్లు
Published on: Thu Jan 7, 2021 3:52PM
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కేసీఆర్ హాస్పిటల్ కు రాగా.. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ పర్యవేక్షణలో అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు సూచనలతో ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. వ్యాధి నిర్ధారణ కోసం అక్కడ పలు పరీక్షలు చేశారు. సీఎం బ్లడ్ శాంపిల్స్ వైద్యులు తీసుకున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ యశోద ఆస్పత్రికి వచ్చారు.
కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు కరోనా లక్షణాలు లేవని చెప్పారు.కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని.. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్ చేశాం.. రిపోర్ట్ శుక్రవారం వస్తుందని ప్రకటించారు. ఎంఐఆర్ స్కానింగ్ అవసరం లేదని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎంవీ.రావు వెల్లడించారు. కేసీఆర్ కు పెద్ద సమస్య ఏమి లేదని టీఆర్ఎస్ నేతలు కూడా చెబుతున్నారు.


