TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్ తీరుపై కేసీఆర్ గుస్సా.. గొడ‌వ‌ల‌కు ఆర్థిక‌ అంశాలే అస‌లు కార‌ణ‌మా?

Published on: Wed Apr 13, 2022 2:57PM

ఢిల్లీలో మోదీని, అమిత్‌షాని క‌లిసి.. మీడియా ముందు అంత‌గా ఆరోప‌ణ‌లు చేసినా.. గ‌వ‌ర్న‌ర్‌ను అస‌లేమాత్రం ప‌ట్టించుకోలేదు తెలంగాణ ప్ర‌భుత్వం. భ‌ద్రాచ‌లంలోనూ ప్రోటోకాల్ పాటించ‌కుండా.. త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించింది స‌ర్కారు. సీఎస్ నుంచి జిల్లా కలెక్ట‌ర్ వ‌ర‌కూ అంతా త‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు డుమ్మా కొడుతుండ‌టంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అసహనంతో రగిలిపోతున్నారు. అయినా, తన పనేదో తాను చేసుకుపోతూ.. ప్రభుత్వాన్ని కవ్వించే పనుల్లో మరింత జోరు పెంచారు. ఖ‌మ్మం గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ర్య‌టించి.. వారికి నిధులు అందించి.. స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ప‌రోక్షంగా ఎత్తి చూపుతున్నారు. త్వ‌ర‌లోనే రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిచి, వారి స‌మ‌స్య‌లు వినే ప్రజా దర్బార్‌కూ శ్రీకారం చుడుతున్నారు. కేసీఆర్‌ను మ‌రింత స‌వాల్ విసురేందుకు రెడీ అవుతున్నారు. 

ఇక‌, ఢిల్లీలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చేసిన రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేటీఆర్‌ను సీఎం చేయ‌డం ఇష్టం లేకే.. కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్‌తో దూరం జ‌రుగుతున్నారు కాబోలు అంటూ త‌మిళిసై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్ర‌కంప‌ణ‌లు రేపుతున్నాయి. ఇప్ప‌టికీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ పాయింట్‌ను క్యాచ్ చేసి.. పొలిటిక‌ల్‌గా వాడేసుకుంటున్నారు. ఇక‌, తాను త‌లుచుకుంటే ప్ర‌భుత్వం ప‌డిపోయేదంటూ గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్ ఇవ్వ‌డం కూడా తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. 

గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో త‌మిళిపై కామెంట్ల‌పై చర్చ జరిగినట్టు స‌మాచారం. గవర్నర్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. చాలా అంశాల్లో తమిళిసైది వితండవాదమని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంత్రులు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మ‌రోవైపు, ప్ర‌గ‌తిభ‌వ‌న్‌- రాజ్‌భ‌వ‌న్ మ‌ధ్య గ్యాప్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక మాత్ర‌మే కార‌ణం కాద‌ని.. మ‌రో అంశం కూడా తీవ్ర ప్ర‌భావం చూపించింద‌ని అంటున్నారు. రాజ్‌భ‌వ‌న్ వ్య‌వ‌హారాల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కొంత‌ బ‌డ్జెట్ కేటాయిస్తుంటుంది. ఆ నిధులు గ‌వ‌ర్న‌ర్ ఆధీనంలో ఉంటాయి. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌గా వ‌చ్చాక‌.. ఆ మొత్తాన్ని భారీగా పెంచాల‌ని స‌ర్కారుకు ప్ర‌తిపాద‌న‌లు పంపించార‌ట‌. కానీ, ప్ర‌భుత్వం త‌మిళిసై ప్ర‌పోజ‌ల్‌ను తిర‌స్క‌రించార‌ట‌. ఆ త‌ర్వాత కూడా ప‌లుమార్లు నిధుల విష‌యంలో రెండు వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య కాస్త పొర‌పొచ్చ‌లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. అవి అలా అలా పెరిగి.. ఇప్పుడిలా తెగేదాకా వ‌చ్చింద‌ని అంటున్నారు. 

త‌మిళ‌నాడులో బీజేపీ కీల‌క నేత‌గా ఉన్న స‌మ‌యంలోనూ.. త‌మిళిసై వ్య‌వ‌హారశైలి కాస్త కాంట్ర‌వ‌ర్సియ‌ల్‌గానే ఉండేద‌ని ఆ రాష్ట్ర‌ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అందుకే, ఆమెను గ‌వ‌ర్న‌ర్‌గా తెలంగాణ‌కు పంపించేశార‌ని కూడా అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్‌గానూ త‌మిళిసై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం.. మోనార్క్ లాంటి కేసీఆర్‌కు న‌చ్చ‌ట్లేదు. ఆయ‌న ఇగో హ‌ర్ట్ అయి.. ప్రోటోకాల్ బ్రేక్ చేస్తూ గ‌వ‌ర్న‌ర్ ఇగోను హ‌ర్ట్ చేస్తున్నారు. త‌మిళిసై మాత్రం త‌న‌కు ఇగో లేదంటూనే.. కేసీఆర్ స‌ర్కారును మాట‌ల‌తో, చేష్ట‌ల‌తో క‌వ్విస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, ఈ  వైరం జ‌గ‌డంగా మారి ఎక్క‌డికి దారి తీస్తుందో...