గొర్రెల పథకంలో గందరగోళం

ఆరు నూరైనా 2019 ఎన్నికలలో కూడా మరోసారి అధికారంలోకి వచ్చి తీరాలని, తన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోపెట్టి తాను రెస్టు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో వున్నట్టున్నారు. అందుకే అన్ని కులాల, మతాల ప్రజలను ఆకర్షించడానికి రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నారు. అలాంటి అనేకానేక పథకాలలో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే పథకం ఒకటి. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం మానేసి, గొల్ల కురుమలను గొర్రెలను కాసుకోవడానికే పరిమితం చేస్తున్నారన్న  ప్రతిపక్షాల విమర్శలను సీఎం కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.

 

తెలంగాణ వ్యాప్తంగా చకచకా గొర్రెలను పంపిణీ చేస్తూనే వున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల గొర్రెలను 2 లక్షల గొల్ల కురుమ కులం వారికి పంపిణీ చేశారు. మరికొన్ని లక్షల గొర్రెలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పథకం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు జోరుగా వినిపిస్తు్న్నాయి. గొర్రెల పంపిణీలో గందరగోళం, అక్రమాలు చోటు చేసుకోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నట్టు తెలుస్తోంది.

 

ప్రభుత్వ నియమాల ప్రకారం గొర్రెలను పొందినవారు వాటిని కొంతకాలం మేపాల్సి వుంటుంది. వాటి ద్వారా కలిగే పిల్లల ద్వారా తమ మందలను పెంచుకోవాల్సి వుంటుంది. అయితే చాలామంది అలా చేయడం లేదు. తమకు అందిన గొర్రెలను ఎంచక్కా వెంటనే అమ్మేసుకుంటున్నారు. అలా అమ్మిన గొర్రెలు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకే చేరుతున్నాయి. మళ్ళీ ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తోంది. అంటే ప్రభుత్వం తాను ఉచితంగా అమ్మిన గొర్రెలనే మళ్ళీ తానే కొనుగోలు చేస్తోందన్నమాట. ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం పసిగట్టింది. ఈ అంశం మీద వెంటనే విచారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చి, పథకాన్ని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించాలని అనుకుంది. అయితే విచారణ కమిటీ వేస్తే అవకతవకలు బయటపడతాయి. అవి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తాయి.

 

ఈ నేపథ్యంలో పథకాన్ని ఆపేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దాంతో గొల్ల కుర్మ ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదం వుంది. దాంతో విచారణ కమిటీని వేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కష్టమైనా, నష్టమైనా ఈ పథకాన్ని వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు తెలంగాణలో మేత దొరకడం లేదట.. చాలామంది ఆంధ్రప్రదేశ్‌కి సదరు గొర్రెలను తోలుకుని వెళ్ళి అక్కడ మేపుకుంటున్నారట. సహేతుకమైన ఆలోచన లేకుండా పథకాలు ప్రవేశపెడితే పరిస్థితి ఇలాగే తయారవుతుంది.