కల్వకుంట్ల వారి "రెడ్డి" రాగం

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ వ్యాఖ్య చేసినా దాని వెనుక ఏదో పరమార్థం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తరచుగా అనేమాట. ఎవరినైనా మాటలతో ఈజీగా బుట్టలో వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తియ్యటి మాటల మాయాజాలంతో తన దారికి తెచ్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయాలు వెలమలకు, రెడ్డకు మధ్య సంఘర్షణగా మారినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాన పార్టీల్లో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అధికం. దీంతో ప్రజల్లో ఆధిపత్యం సంపాదించడానికి ఈ అగ్రకులాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కులం కార్డుతో ఒకరి నొకరు ఓడించుకునేందుకు, ప్రజల్లో బలంగా నాటుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు.

 

అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా గ్రామాల్లో దొరతనం నెరిపిన రెడ్లు, వెలమలు, కరణాలు నగరాలకు తరలివెళ్లారు..కానీ రాజకీయంగా వారు తమ తమ గ్రామాల్లో పట్టును కోల్పోలేదు. రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాపాడుకుంటూ చట్టసభలకు వారే ఎన్నికవుతూ వస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే 2019 ఎన్నికలకు ప్రణాళిక గీస్తూ ముందుకు సాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..ఆ దిశగా తనకు పోటీ అనుకున్న ప్రతీ ఒక్కరిని నామరూపాల్లేకుండా చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో బలమైన నాయకులుగా ముద్రపడిన వారందరినీ కారు ఎక్కించుకున్నారు.

 

అయితే యేళ్ల తరబడి నుంచి అధికారం..దశాబ్దాల నుంచి పెత్తనం..రాష్ట్రం నుంచి వార్డు వరకు వారిదే హవా సాగించిన రెడ్లను రాష్ట్ర విభజన అనాథలను చేసింది. ఊహించని విధంగా అధికారానికి దూరమై ఉనికి కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. అధికారం చేతి నుంచి జారిపోవడంతో రెడ్డినాయకులు జావగారిపోయారు.

 

కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తున్న కొద్ది తెలంగాణలో రెడ్డి నాయకులు కుచించుకుపోతున్నారు. ఏనాటికైనా తెలంగాణలో తనకు వ్యతిరేకంగా నిలిచేది రెడ్డి వర్గమేనని కేసీఆర్ బలంగా విశ్వసిస్తుండటంతో ఈ వర్గాన్ని చితక్కొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. అయితే ఈ విషయం జనాల్లోకి వెళుతుండటంతో రెడ్డి జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ నగర శివారు బుద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌‌కు శంకుస్థాపన చేశారు.. పనిలో పనిగా రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి నుంచి జీవీకే రెడ్డి వరకు ప్రముఖ స్థానాల్లో నిలిచిన రెడ్లను ఏకబిగిన పొగడటం మొదలెట్టారు. మరి కేసీఆర్ బిస్కెట్లతో రెడ్లు మెత్తబడతారా..లేక తమ పోరాటాన్ని కొనసాగిస్తారో కాలమే చెప్పాలి.