కేసీఆర్‌ను ఢీకొట్టే నాయకుడేడి?... అమిత్‌షా పాచికలు పారతాయా?

 

తెలంగాణ అనగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు గుర్తొచ్చే పేరు కేసీఆర్. తెలంగాణ సాధకుడిగా నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఆయనకు విశేష అభిమానముంది. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, ఇప్పించిన బీజేపీని కాదని, కేసీఆర్‌కు పట్టంకట్టారు జనం. దేశమంతా మోదీ హోరుగాలిని తట్టుకుని తెలంగాణలో కేసీఆర్‌ విజయం సాధించారు. ఇప్పటివరకైతే, ప్రభుత్వ వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. మూడేళ్లలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎన్నికల విజయాలే అందుకు నిదర్శనం. ఏ పార్టీకైనా అధికార కాంక్ష ఉండటం సహజమే, అయితే టీఆర్ఎస్‌ను కాదని ఇఫ్పుడు తెలంగాణలో ఏ పార్టీనీ జనం విశ్వసించే పరిస్థితిలేదంటున్నారు విశ్లేషకులు.

 

తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌. కానీ నాయకుల్లో ఐక్యత లేకపోవడం, కేసీఆర్‌‌కు ధీటైన లీడర్‌ కానరాకపోవడం హస్తం పార్టీకి లోటు. కానీ ఊరూరా కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ ఉంది. టీడీపీలోనూ నాయకత్వ సంక్షోభమున్నా, కార్యకర్తలున్నారు. వామపక్షాల ప్రభావం నామమాత్రమైనా, పటిష్టమైన శ్రేణులున్నాయి. వీటితో పోలిస్తే, బీజేపీకి అంతబలమైన క్యాడర్ లేదు. మరి స్థానికంగా బలంగా ఉన్న ఈ పార్టీలను కాదని, బీజేపీకి పట్టంకడతారా? ఉత్తరాది ఫార్ములాకు ఇక్కడ ఆమోదం లభిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి

 

క్షేత్రస్థాయిలో బలంగా లేనందుకే బీజేపీ రకరకాల ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలోని జనాకర్షక నేతలను పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటోంది. కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, అలాగే టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డిలకు కాషాయ జెండా కప్పాలని ప్రయత్నిస్తోంది. ఇంకా భావసారూప్యత ఉన్న నాయకులను పార్టీలోకి చేర్చుకుని, బలమైన క్యాడర్‌ను నిర్మించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది.

 

ఇలా బలమైన ప్రతిపక్షం లేకపోవడం, కులమత సమీకరణలు, మోడీ అభివృద్ది మంత్రతో తెలంగాణలో పాగా వేయాలని స్కెచ్‌ వేస్తున్నారు అమిత్‌ షా. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకుపోవాలో మూడు రోజుల పర్యటనలో కాషాయ శ్రేణులకు వివరించబోతున్నారు షా. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టగల నాయకుడు తెలంగాణ బీజేపీ నేతల్లో ఒక్కరూ కూడా కనబడటం లేదనే చెప్పాలి. మరి అమిత్‌ షా స్ట్రాటజీ ఇక్కడ సక్సెస్‌ అవుతుందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.