వర్కింగ్ ప్రెసిడెంట్‌ ప్రకటనను అడ్డుకున్నదెవరు?

 

గులాబీ దళపతిగా ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేసీఆర్. అయితే ప్లీనరీ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కూడా ప్రకటిస్తారని అంతా ఊహించారు. టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్షాల్లో కూడా దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా ప్లీనరీ ముగిసింది. దాంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించకపోవడానికి కారణమేంటనే చర్చ.... గులాబీ శ్రేణుల్లో మొదలైంది.

 

పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్‌తోపాటు హరీష్‌రావు, కేటీఆర్‌... ఇద్దరూ సమానంగా శ్రమిస్తున్నారు. అయితే ఇటీవల కేసీఆర్‌ ప్రోత్సాహంతో హరీష్‌ కంటే కేటీఆర్‌ కొంచెం ముందున్నారనే చెప్పాలి. గ్రేటర్‌ ఎన్నికల నుంచి జనహిత సభలు, ప్లీనరీ నిర్వహణ అన్నింటిలోనే కేటీఆర్‌ దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ రాబోతుందని అంతా ఉహించారు. అయితే కేసీఆర్ మాత్రం... కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించే సాహసం చేయలేకపోయారని అంటున్నారు.

 

కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయని కేసీఆర్ భావించారని పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. హరీష్, కేటీఆర్‌లలో ఎవరు నెంబర్ 2 అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. హరీష్ నిరాశపరచడం ఎందుకని గులాబీ అధినేత వెనక్కితగ్గారట. అంతేకాదు కొడుకుకి పదవి కట్టబెట్టడం ద్వారా.. అల్లుడిని అవమానించారనే అవకాశం ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పైగా పార్టీలో అనవసరమైన పోటీ ఎందుకని కేసీఆర్‌ భావించారంటున్నారు. అన్నింటికి మించి కేసీఆర్ యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత తరుణంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఎందుకన్న భావనలో కూడా టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఒకవేళ అయితే గియితే.... 2019 ఎన్నికల తర్వాతనే కేటీఆర్‌‌ను  వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటంచే అవకాశముందంటున్నారు.