కనీస హక్కుల్నీ హరిస్తున్నారు.... ఎమర్జెన్సీలోనూ ఇంత అణచివేత జరగలేదు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధానాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రశ్నించినా, విమర్శించినా, ఆరోపణలు చేసినా, ఆఖరికి ముఖ్యమంత్రిని గానీ, ప్రభుత్వాన్ని గానీ చిన్న మాటన్న తట్టుకోలేకపోతున్నారు. తమని ఎక్కడా, ఎవ్వరు విమర్శించరాదన్నట్లు వ్యవహరిస్తోంది. అసెంబ్లీ లోపలా బయలా అంతటా ఆంక్షలు పెడుతోంది. ఆందోళన చేస్తారన్న అనుమానం వస్తే చాలు ముందస్తుగా అరెస్టులకు దిగుతోంది. మొన్న టీ జాక్ నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకునేందుకు వేల మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. అర్ధరాత్రి జాక్ చైర్మన్ కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్టులకు దిగింది. ఏకంగా ధర్నాచౌకే ఎత్తేసింది.

 

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రజల నిరసన వేదికగా ఇందిరా పార్క్ నిలిచేది. ఆందోళనకారులు ఇందిరాపార్క్ దాటి అసెంబ్లీ లేక సచివాలయం వైపు రాకుండా కట్టడి చేసేవారు. ఎవరన్నా ఆ హద్దులు దాటి ముందుకొస్తే అరెస్టు చేసేవారు. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసింది. సిటీకి దూరంగా శివారు ప్రాంతాల్లో ఆందోళన చేసుకోవాలని సూచించింది. విపక్షాలు ఎంత వ్యతిరేకించినా పట్టించుకోవడం లేదు. నిరసన హక్కు కాలరాయొద్దన్నా,. డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తోంది. ధర్నాలు, దీక్షలకు ముందురోజే అరెస్టులు చేస్తోంది.

 

అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సభ్యులు తప్పుబడుతున్నారు. మీడియా పాయింట్ లో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడొద్దని మౌఖిక ఆదేశాలివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే మాజీలనే కాదు సస్పెండైన తాజా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టనీయడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో రేవంత్‌రెడ్డి, సండ్ర, వీహెచ్‌తోపాటు పలువురికి తీవ్ర పరాభవం ఎదురైంది.  ఇది పోలీసు రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా అంటూ విపక్ష నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమాల అణచివేతని తప్పుబడుతున్నారు.

 

ఎమర్జెన్సీ సమయంలోనూ ఇంత అణచివేత జరగలేదని, కనీస హక్కుల్ని కూడా హరిస్తున్నారని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తానికి ఆందోళనకారులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఆందోళనలను అణచి వేసేందుకు ముందస్తు అరెస్టులు చేయడం, చిన్న విమర్శను కూడా సహించలేకపోవడాన్ని  మేధావులు సైతం తప్పుబడుతున్నారు. ఇదే కొత్త పోకడ అంటూ మండిపడుతున్నారు.

Related Segment News