TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రానికి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌లైన్‌.. మంగ‌ళ‌వారం కేబినెట్ మీటింగ్‌..

Published on: Mon Apr 11, 2022 2:56PM

ఢిల్లీ దీక్ష‌తో సీఎం కేసీఆర్ వ‌రిపై వాడి-వేడి పెంచారు. ధాన్యం కొంటారా? కొన‌రా? తేల్చాలంటూ కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. రైతు ఉద్య‌మంతో భూకంపం సృష్టిస్తామంటూ హెచ్చ‌రించారు. షీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్ అంటూ కేంద్ర‌మంత్రినీ ఏకిపారేశారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దు అని హిత‌వు ప‌లికారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణలో రైతులు పండించే ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. దీక్షకు రైతు నేత టికాయత్ సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని తెలంగాణ నుంచి సుమారు 2వేల కి.మీ. వచ్చి దీక్ష చేస్తున్నాం.. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌. 

‘‘ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్‌ విధించాం. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. రైతులను కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఊరికేపోదు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. కేంద్రాన్ని గద్దెదించే సత్తా రైతులకు ఉంది. తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా?’’అని కేంద్రంపై కేసీఆర్ మండిప‌డ్డారు. 

‘‘కేంద్రమంత్రి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. షీయూల్‌ గోయల్‌ తెలంగాణ రైతులు నూకలు తినాలని చెప్పారు. మేం గోయల్‌ దగ్గర అడుక్కోవడానికి వచ్చామా? షీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌. గోయల్‌ ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు. పీయూష్‌ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటాం. మా మంత్రులు ఏమైనా పనిపాట లేక పీయూష్‌ వద్దకు వెళ్లారా? మా మంత్రులను పీయూష్‌ ఎలా అవమానిస్తారు? కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించేది లేదు’’. అన్నారు సీఎం కేసీఆర్‌.

‘‘దేశవ్యాప్తంగా ఎక్కడా లేని 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయి. మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. టికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. బీజేపీ తెలంగాణ నేతలు మా దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో ధర్నా చేస్తారా? సిగ్గుండాలి. పంట మార్పిడి చేయవద్దని మేం రైతులకు చెప్పాం. రైతులు ధాన్యం పండించండి.. కొంటామని బీజేపీ చెప్పింది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రైతులను రెచ్చగొట్టారు’’ అని కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘హిట్లర్‌, నెపోలియన్‌ వంటి అహంకారులు కాలగర్భంలో కలసిపోయారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? నన్ను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రహదారులపైకి వస్తారు. బోర్లకు మీటర్లు పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మోదీ, పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్‌ అన్నారు. 

మ‌రోవైపు, కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్‌.. స‌రిగ్గా ఆ 24 గంట‌ల త‌ర్వాత మంగ‌ళ‌వారం అత్య‌వ‌స‌రంగా తెలంగాణ కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. మంత్రిమండ‌లిలో చర్చించి,. కేంద్రంపై పోరును మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. మ‌రి, కేసీఆర్ నిర్ణ‌యాలు ఎలా ఉండ‌బోతున్నాయి? కేంద్రంపై సంచ‌ల‌నాలు ఉండ‌బోతున్నాయా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.