ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ భజనా! జగన్ సర్కార్ కు రూల్స్ పట్టవా ? 

భారత రాజ్యాంగ నియమాలు  పట్టవా?  ప్రజ్వాస్వామ్య స్పూర్తిని గాలి కొదిలేసి..  ఏం చేయాలనుకుంటే అది చేయడమే వాళ్ల రాజ్యాంగమా? ఇవి ఆంధ్రప్రదేశ్ లో  పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి సర్కార్ తీరును చూస్తున్న వారికి వస్తున్న సందేహాలు. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ ప్రోగ్రామ్ లకు తేడా తెలియకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  నెల్లూరు జిల్లాలో నిర్వహించిన అమ్మఒడి రెండో విడత అమలు కార్యక్రమం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ప్రజా ధనంతో నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేస్తూ.. తమ  అధినేతను పొగుడుతూ  వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు చిల్లరగా ప్రవర్తించారు. వైసీపీ నేతల తీరుపై రాజకీయ వర్గాలతో పాటు జనాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 
   
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది. పంచాయతీ ఎన్నకలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడంతో శనివారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా  కోడ్ అమల్లోకి వచ్చింది. అమ్మఒడి పథకం గతంలోనే ప్రారంభించింది.. రెండో విడత అమలు అందులోనే భాగంగా కావడంతో.. ఆ కార్యక్రమానికి ఎస్ఈసీ పర్మిషన్ ఇచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని, లబ్దిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారుల చేతుల మీదుగానే అమ్మఒడి రెండో విడత అమలు జరగాలని స్పష్టమైన అదేశాలు ఇచ్చింది. కాని స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీని వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్.. కోడ్ నిబంధనలను పట్టించుకోవద్దనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉంది. అందుకే నెల్లూరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులంతా పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. ఏకంగా ఆ  కార్యక్రమాన్ని  తమ పార్టీ సభను తలపించేలా మార్చేశారు. సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీ నేతలంతా రాజకీయ ప్రసంగాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమం అన్న సంగతి మర్చిపోయి.. వ్యక్తిగత దూషణలు చేస్తూ విరుచుకుపడ్డారు. తమ పార్టీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నా కనీసం వారించే ప్రయత్నం చేయలేదు సీఎం జగన్. దీంతో వైసీపీ మంత్రులు , నేతలు మరింత రెచ్చిపోయారు. ఈ సభలోనే స్వయనా ముఖ్యమంత్రి జగన్ కూడా  విపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి  పనులు చూడలేక ప్రతిపక్ష పార్టీలకు  మంట పుడుతుందని ఆరోపించారు. చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, రథాలను తగలబెడుతున్నారని చెప్పారు. అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేసిన వారు దేవుళ్లపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా కొందరు కోవర్డులు నోటిఫికేషన్లు ఇస్తున్నారంటూ ఏకంగా ఎన్నికల కమిషనర్ నే టార్గెట్ చేశారు సీఎం జగన్. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా నిర్వహించిన సభలో పాల్గొనడమే కాకుండా ఎస్ఈసీపైనా సీఎం ఆరోపణలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 

నెల్లూరు అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని, రాష్ట్ర విభజన తర్వాత కాని ఇలాంటి పరిణామాలు గతంలో  ఎప్పుడు జరగలేదంటున్నారు. గతంలో పని చేసిన ముఖ్యమంత్రులు కాని మంత్రులు గాని ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉండేవారు. ఏదైనా మాట్లాడాలి అనుకున్నా...  పరోక్షంగా తాము చెప్పదలుచుకున్న విషయాలను చెప్పేవారు. దివంగత వైఎస్సార్ కూడా పార్టీ సభల్లోనే టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసే వారు కాని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో హుందాగానే వ్యవహరించేవారని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాను అనుకున్నదే చట్టం.. పాటించేది రాజ్యంగం అన్నట్లుగా ఇష్టారాజ్యంగా ముందుకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పోకడలు మంచివి కావని మేథావులు అభిప్రాయపడుతున్నారు. 

 మొత్తానికి  ప్రభుత్వ కార్యక్రమంలో.. అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు  ఇంత దారుణంగా వ్యవహరించడమేంటనే చర్చ జరుగుతోంది. రాజ్యాంగ రూల్స్ కు విరుద్దంగా ముందుకు వెళుతూ వైఎస్ జగన్ నెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని కొందరు జనాలు ఫైరవుతున్నారు.