హస్తినలో రఘురామకృష్ణరాజు, జగన్ ఫైట్
Published on: Thu Jun 10, 2021 12:18PM
ఎంపీ లేదు గింపీ లేదు..రాజ్యం మనది.. రాజ్యాంగం మనమే.. అంటూ చెలరేగిపోయారు. ఇప్పుడా ఎంపీ గడపగడపకు తిరుగుతూ వీరి వ్యవహారం గురించి పూసగుచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు. హస్తినలో ఇప్పుడు తెలుగు రాజకీయం మార్మోగుతుంది. రఘురామరాజు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు పార్లమెంట్ సమావేశాలకు ముందు నుంచే వేడి పుట్టింది. ఈ ఎపిసోడ్ పై పార్లమెంట్ లో లేవనెత్తుతామని .. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా అయ్యగారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రాజుగారి వర్గం చెబుతుంటే... రఘురామకృష్ణరాజు టీవీ ప్రసంగాలన్నీ స్పీకర్ కు సమర్పించి వివరిస్తామని.. ఈసారి సస్పెన్షన్ వేటు ఖాయమని వైసీపీ వర్గం చెబుతోంది. ఈ ఇరు వర్గాల పోటాపోటీ లాబీయింగ్ తో హస్తిన పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
విజయసాయిరెడ్డితో మొదలైని విబేధాలు రఘురామకృష్ణరాజు ప్రభుత్వ నిర్ణయాలను నేరుగా నిలదీసేదాకా పోవడంతో.. వైరం ముదిరి పాకాన పడింది. స్వయంగా పార్టీ ఎంపీయే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడం.. పైగా ఇసుక, ఇళ్ల స్ధలాల కొనుగోలు వంటి వాటిలో జరిగిన అవినీతిని ఉధాహరణలతో సహా బయటపెట్టడం ఇవన్నీ..జగన్ శిబిరంలో కాక పుట్టించాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డినే పేరు పెట్టి నిలదీయటం మొదలెట్టడంతో.. ఇక ఆపకపోతే తప్పదనుకున్నారో ఏమో..రూల్ లేదు.. చట్టం లేదు.. వేసుకోచ్చేయండి అని సినిమా ఫక్కీలో..హైదరాబాద్ ఇంట్లో ఉన్న ఎంపీని..గుంటూరుకు ఎత్తుకొచ్చేశారు సీఐడీ అధికారులు.
ఇక ఆ తర్వాత జరిగిన ప్రహసనాలన్నీ అందరికీ తెలిసిందే. తనను కొట్టారని ఎంపీ ఆరోపించడం..కాదని వైసీపీ వర్గాలు వాదించటం.. చివరకు ఆర్మీ ఆస్పత్రి దెబ్బలున్నాయని సుప్రీంకోర్టుకు చెప్పడం..బెయిల్ రావడం అన్నీజరిగిపోయాయి. బెయిల్ వచ్చిన దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు ఒకే పని పెట్టుకున్నారు. కేంద్రంలోని పెద్దలకు, సహచర ఎంపీలకు..ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారికి ఈ ఎపిసోడ్ మొత్తం వివరించడం...ఏపీ ప్రభుత్వం డైరెక్షన్ లో ఏపీ సీఐడీ ఏ రేంజ్ లో కథ నడిపించిందీ చెప్పుకురావడంతో.. వారందరూ స్పందిస్తున్నారు. ఏ ఎంపీ స్పందిస్తున్నారు.. ఏమన్నారో కూడా రఘురామకృష్ణరాజు క్యాంప్ మీడియాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. దీంతో అక్కడ ఏం జరగబోతుందో కొందరు ఊహించగలుగుతున్నారు.
ఒక సిట్టింగ్ ఎంపీని ఈ విధంగా చేయడం దారుణమనే అభిప్రాయం అయితే అందరి నుంచి వస్తోంది. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ఆయా ఎంపీలు ఓపెన్ గానే చెప్పారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ జగన్మోహన్ రెడ్డి శిబిరం.. ఆ పరిస్ధితిని ఎదుర్కోవటానికి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే స్పీకర్ కు రఘురామకృష్ణరాజు ప్రసంగాలన్నీ చూపించి.. ఏ విధంగా పార్టీకి, ప్రభుత్వానికి ద్రోహం చేసింది వివరిస్తారట. ఇప్పటికే ఎంపీని సస్పెండ్ చేయాలని వైసీపీ స్పీకర్ కు విన్నవించింది. ఇప్పుడు తాజా పరిణామాలను కూడా వివరించి సస్పెన్షన్ కు పట్టుబడతారట. అమిత్ షా తో భేటీలో ఇదే విషయంపై కీలక చర్చ జరగనున్నదని వైసీపీ శిబిరం చెబుతోంది. మరి రఘురామకృష్ణరాజుపై సానుభూతి వర్కవుట్ అవుతుందా... సిట్టింగ్ ఎంపీని పోలీసులు ఇలా రూల్స్ తొక్కేసి మరీ ఇబ్బందిపెట్టడం హైలెట్ అవుతుందా... లేక జగన్ మంత్రాంగం ఫలిస్తుందో కొన్ని రోజుల్లోనే తెలిసిపోనున్నది.


