TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

10,665 మందికి జీతం క‌ట్‌.. ఉద్యోగుల‌కు జ‌గ‌న్ బిగ్ షాక్‌..

Published on: Wed Jan 12, 2022 4:55PM

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు త‌ప్ప.. అంటూ ఏపీలో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ఉద్య‌మించారు. ప్రొబేష‌న్ డిక్ల‌రేష‌న్ చేయాలంటూ ఆందోళ‌న చేశారు. అణ‌చివేతే ఎజెండాగా ప‌రిపాలిస్తున్న సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. ఆ చిన్న ఉద్యోగుల‌పై క‌న్నెర్ర జేశారు. ఆ రోజు విధుల‌కు హాజరు కాకుండా త‌మ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేసిన వారంద‌రికీ జీతం క‌ట్ చేయాల‌ని ఆదేశించారు. జ‌గ‌న‌న్న దెబ్బ‌కు వేల సంఖ్య‌లో ఉద్యోగులు ల‌బోదిబో మంటున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే....

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 మంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో ప్రభుత్వం కోత పెట్టింది. సచివాలయ ఉద్యోగులందరికీ జీతభత్యాలు మినహాయించాలంటూ.. డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి జీతభత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీతభత్యాలు కోత విధించడం ఏంటంటూ సచివాలయ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ డిక్లేర్‌, పే స్కేల్‌ అమలు చేయలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. సచివాలయాల ఉద్యోగులకు మాత్రం జులై నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ప్రొబేషన్‌ పూర్తయినందున వెంటనే డిక్లరేషన్‌ ప్రకటించి పే స్కేలు వర్తింప జేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నోషల్‌ ఇంక్రిమెంట్లు, 4 డీఏలు ఇవ్వాలని, మరణించిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామక ఉద్యోగం ఇవ్వాలని, ఈహెచ్‌ఎస్ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలనేవి వారి డిమాండ్లు. అయితే, డిమాండ్ల మాట దేవుడెరుగు.. ఇప్పుడు ఆందోళ‌న చేసినందుకు ఒక‌రోజు జీతం కోత ప‌డ‌టంతో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు కంగుతిన్నారు. న్యాయం చేయాల‌ని ప్ర‌శ్నిస్తే.. చిరుఉద్యోగుల జీతం కోయ‌డ‌మేంట‌ని మండిప‌డుతున్నారు.