పోస్కో డీల్ కు జగనే డైరెక్షన్!  

విశాఖ స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంతో పోస్కో చేసుకున్న ఒప్పందం వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అందుకు బలమైన ఆధారాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 

స్టీల్ ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి  మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జూన్ 2019లో పోస్కోతో సమావేశమై, జులై 2019లో  సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారని...అక్టోబర్‌లో ఎంఓయూ చేసుకున్నారని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రికి సమాచారం తెలిస్తే ప్రజలకు  ఎందుకు  చెప్పలేదని పట్టాభి ప్రశ్నించారు. 

స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తామంటున్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని పట్టాభి నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్‌తో, విజయసాయిరెడ్డితో పోస్కో ప్రతినిధులు సమావేశం అయ్యారని చెప్పారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్‌ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుందని పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు.