ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎథిక్స్ కమిటీకి తన ఆస్తుల వివరాలను చంద్రబాబు తెలియజేస్తూ వస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే తన బ్యాంకు బేలన్స్ కొంచెం పెరిగిందని, మిగతా ఆస్తులు అలాగే వున్నాయని చంద్రబాబు చెప్పారు. అలాగే తన భార్య ఆస్తులు కూడా అలాగే వున్నాయని, ఆమె ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మాత్రం కొంత బేలన్స్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి ఆస్తులను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి వారి ఆస్తులు వారే ప్రకటించుకుంటారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా తమ కుటుంబం చేస్తున్న వ్యాపారాల వివరాలను కూడా చంద్రబాబు ప్రకటించారు. తమ కుటుంబానికి ఏదో ఒక జీవనాధారం వుండాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ సంస్థను ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు. తమ నిర్వహణలో వున్న హోల్డింగ్స్ ఆస్తుల విలువ 90 లక్షలు పెరిగిందని ఆయన వెల్లడించారు. ఒక్క చిన్న అవకతవక కూడా లేకుండా తమ ఆస్తులు వుంటాయని ఆయన చెప్పారు.తన ఆస్తుల వివరాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పూర్తిగా చదివి వినిపించారు. తన ఆస్తుల వివరాలను వెల్లడించడం తన బాధ్యతగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.