అధికారులను ఆదేశించే అధికారం సీఎంకు లేదా?

 

ఏపీలోని ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ విషయంలో ఈసీ తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమని, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీకి 9 పేజీల లేఖ రాశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను తానెప్పుడూ చూడలేదన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం, మంచినీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాలపై సీఎం సమీక్షలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్‌ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్షమని ఆరోపించారు. వైసీపీ చేసిన ఫిర్యాదులపై విచారణ లేకుండానే బదిలీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. 'టీడీపీ చేసిన ఏ ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. కానీ, వైసీపీ చేసిన ఫిర్యాదులపై వెంటవెంటనే నిర్ణయాలు అమలయ్యాయి. ఫిర్యాదులు చేసిన టీడీపీ నేతలను ఐటీ దాడులతో భయపెట్టారు. ఆధారాలు లేని కేసులతో వారిని ఇబ్బందులు పెట్టారు’ అని చంద్రబాబు ఆరోపించారు. ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌ నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని అన్నారు. దీంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని లేఖలో పేర్కొన్నారు.

సీఈవో తన అధికార పరిధిని దాటుతున్నారన్న చంద్రబాబు.. సీఎంకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రిపోర్ట్‌ చెయ్యకూడదని.. ఈసీ నిబంధనల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రంలో ఐబీ చీఫ్‌ ప్రధానమంత్రికి ఎలా రిపోర్ట్‌ చేస్తారో.. రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీఎంకు అలాగే రిపోర్ట్‌ చేయాలన్నారు.  సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయడం సీఈవోకు తగదని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని సీఈవోకు ఉత్తర్వులివ్వాలివ్వాలన్నారు. సమీక్షలపై సీఎం అధికారాలను ఆపే హక్కు ఈసీకి లేదన్నారు. ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, ఎండల కారణంగా గత వారంలో ఏడుగురు మరణించారన్నారు. వైపరీత్యాలపై జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులను ఆదేశించే అధికారం సీఎంకు లేదా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా.. మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరోలా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.