జల్లికట్టుకు.. ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటో..


జల్లికట్టుపై తమిళనాడులో ఉద్రితంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జల్లికట్టు ప్రభావం ఏపీ పై కూడా పడింది. జల్లికట్టు కోసం తమిళనాడు యువత ఆందోళనలు చేస్తున్న మాదిరిగా.. ఏపీ ప్రత్యేక హోదా కోసం కూడా యువత పోరాడాలని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనిపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్స్ కూడా చేశారు. యువత పోరాటం చేస్తే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

 

అయితే ఇప్పుడు దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి.. జ‌ల్లిక‌ట్టుకు ప్ర‌త్యేక హోదాకు పోలిక ఏమిటో తనకు అర్థం కావ‌ట్లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధే త‌న‌కు ముఖ్య‌మని, కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌లు పెట్టుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదాపై కేవీపీ చంద్రబాబుకు లేఖ రాయగా.. దానిపై కూడా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన‌వారే త‌న‌కు ఇప్పుడు ప‌లు లేఖ‌లు రాస్తుండ‌డం త‌న‌కు విచిత్రంగా అనిపిస్తోంద‌ని అన్నారు. తాను రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, భ‌విష్య‌త్తు విష‌యంలో రాజీప‌డ‌బోన‌ని, త‌న‌పై న‌మ్మ‌కం ఉంచే ప్ర‌జ‌లు త‌న‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని, దానిని నిల‌బెట్టుకుంటున్నాన‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మని అన్నారు.