ఓట్లు తీసేసి సారీ చెప్పారు

 

ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన వినతి పత్రం అందజేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, అనిల్ యాదవ్, వైఎస్ భారతీ రెడ్డి అసిస్టెంట్ అనితా రెడ్డిలకు సంబంధించిన ఆడియో టేపులను సీఈఓకు చంద్రబాబు అందజేశారు.

ద్వివేదిని కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఈవోను ఒక సీఎం కలవడం ఇదే తొలిసారి అని అన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని ద్వివేదికి చెప్పామన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరామని చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓట్లను కౌంట్‌ చేయడానికి 6 రోజులు పడుతుందని, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే సారీ చెప్పి వదిలేశారని విమర్శించారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, అకారణంగా కడప ఎస్పీని బదిలీ చేశారని మండిపడ్డారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలపై ఏకపక్షంగా ఐటీ దాడులు చేశారని, వైసీపీలో అవినీతిపరులు లేరా? ఎందుకు దాడులు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.