వాళ్ళు జైలుకి వెళ్లారంటే జగనే కారణం

 

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి కేంద్రమే బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకా రూ.85వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని నిపుణుల కమిటీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు. తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. రూ.6లక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్‌ అంటున్నారని, రాష్ట్ర బడ్జెటే అంత లేదన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేసిందని చెప్పారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై సీబీఐ ఛార్జి షీట్‌ వేసిందని ఆయన విమర్శించారు.

జగన్‌ నిర్వాకం వల్ల పలువురు పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లు జైలుకు వెళ్లారని మండిపడ్డారు. పూర్తిగా బురదలో కూరుకున్న జగన్‌ తనపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. మోడీ అవినీతి చేస్తే మాట్లాడరని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు మాత్రం అడ్డుపడతారని చంద్రబాబు విమర్శించారు. మోడీ, కేసీఆర్‌, జగన్‌ ఆడుతున్న నాటకాలు ఇకపై చెల్లవన్నారు. మోడీకి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఆదాయం లేకపోయినా అభివృద్ధిలో ముందుకుపోయామని, దగాకోరు నాయకులకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అంతేకాకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై స్పందించారు. ఎన్నికలు వస్తున్నందువల్లే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, వెంటనే కేంద్రం వారికీ  రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాల్మీకులకు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం రూ.100 కోట్లు కేటాయించి త్వరలోనే ఆ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. వాల్మీకి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.