ప్రధాన మంత్రి అయిన చంద్రబాబు...!

 

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన బీజేపీ నుండి విడిపోయారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడే రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుకునేవారు. ఇక విడిపోయిన తరువాత అయితే చెప్పనక్కర్లేదు. దానికి తోడు టీడీపీ మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పరిస్థితి ఇంకా తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. అసలే టీడీపీ అంటే మండిపడుతున్న బేజీపీ మంటలో ఇప్పుడు ఓ విషయం ఆజ్యం పోసినట్టైంది. అదేంటనుకుంటున్నారు..? అసలు సంగతేంటంటే...

 

మంగళగిరి సీవీ కన్వెనన్లో సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు సంతోష నగరాల సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక్కడే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన భూటాన్లోని, జెలెఫర్ నగర మాజీ మేయర్ ఆకారాం కెప్లీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రధానమంత్రిగా సంభోదించారు. స్మార్ట్ నగరాల నిర్మాణం పై తన అనుభవాలను వివరించిన కెప్లీ 'ప్రైమ్ మినిస్టర్' చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు. తనకు ఉన్న అపారమైన అనుభవంతోనే అమరావతి నిర్మాణానికి సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ప్రధానమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలరనే నమ్మకం తమకు ఉందన్నారు.

 

దీంతో చంద్రబాబును ఏకంగా ప్రధానమంత్రిగా సంబోధించంపై రాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాదు... ఇది కావాలనే చంద్రబాబు చేసిన కుట్ర అంటూ, చంద్రబాబు ఇలా కావాలనే వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు అని ఎప్పటిలాగే విమర్శలు మొదలుపెట్టారు. దీనికి టీడీపీ నేతలు కూడా స్పందించి... చంద్రబాబుకు అలా అనిపించుకోవాల్సిన అవసరం లేదు... రెండు సార్లు ఆ పదవి చేపట్టే అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం ఆయన ఆపదవిని వదిలిపెట్టుకున్నారని... వేరే వాళ్లయితే ఆ పని చేసేవారు కాదని కౌంటర్ ఇచ్చారు. మరి అప్పుడంటే చంద్రబాబు వదిలిపెట్టారు... ఇప్పుడు ఆ అవకాశం వస్తే చంద్రబాబు వదిలిపెట్టి తప్పు చేయరేమో. చూద్దాం.. చంద్రబాబు మళ్లీ పీఎం అయ్యే ఛాన్స్ వస్తుందేమో..