చంద్రబాబు సీరియస్...నేనేం తప్పుచేశాను....

 

సాధారణంగా రాజకీయ నేతలు ఒకరి మీద ఒకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా.. ముఖా ముఖిగా కలిసినప్పుడు మాత్రం బాగానే పలకరించుకుంటారు. కాసేపు ముచ్చటించుకుంటారు. పాపం అలా ముచ్చటించి బుక్కయ్యాడు టీడీపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్. ఇటీవల పరిటాల శ్రీరామ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు అందరూ విచ్చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఇక ఆయనతో పయ్యావుల కేశవ్ ఏకాంతంగా మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, "తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది... అక్కడి వాళ్ల మనోభావాలను మనం గౌరవించాలి. నేను, కేసీఆర్ కూడా కలుసుకున్నాం. ఒకచోట ఎదురుగా వచ్చి, రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆపై ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. కానీ మన మంత్రులు, నేతలు పరిధులు దాటి ఆయనతో దగ్గరగా మెసిలారు" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారట.  "పయ్యావుల సీనియర్. ఆయనకు కేసీఆర్ తో ఏకాంత సమావేశాలు ఎందుకు? ఏం సందర్భం ఉంది? పెద్ద నేతలు కూడా ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో రాజీనామాలు చేసి వెళతామంటున్నారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

కాగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పయ్యావుల ఫీల్ అయినట్టు రాజకీయ వర్గాల టాక్.  పరిటాల ఇంట పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని.. కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానని, ఆ వెంటనే తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని ఆయన పంపి తనను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లానని చెప్పారు. ఆయనే తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదని..జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించారట. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూద్దాం..