రాయలసీమ టీడీపీలో వర్గపోరు... చంద్రబాబుకు తంటాలు..!

 

తమ్ముళ్ల వ్యవహారం చంద్రబాబుకు బీపీ తెప్పిస్తోంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ ఎక్కడచూసినా పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే సంఘటనలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలతో పార్టీకి బలం అనుకుంటే, అదికాస్తా పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసింది. దాంతో తానొకటి అనుకుంటే తమ్ముళ్లొకటి తలుస్తున్నారన్న ఆవేదన చంద్రబాబును వేధిస్తోంది. ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చివరకు హత్యలవరకూ దారితీయటం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది.

 

ఏ ఒక్క జిల్లాలోనూ లీడర్లు హ్యాపీగా ఉన్న పరిస్థితి కనిపించటం లేదు. మొన్నటికి మొన్న చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ చేసిన రచ్చ చంద్రబాబుకు తలబొప్పి కట్టేలా చేసింది. అదే సమయంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గాలి సైలెంటవ్వటం, మంత్రి పదవి తీసేసిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాస్తంత వయొలెంటుగా స్పందించటం పార్టీ శ్రేణుల్ని అభద్రతా భావానికి గురయ్యేట్లు చేసింది. ఇక అనంతపురంలో మంత్రి పరిటాల తనయుడు శ్రీరామ్ వివాదాల్లోకి తలదూర్చటం, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పయ్యావుల కేశవ్ వ్యూహాత్మక మౌనం పాటించటం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది.

 

ఇక ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే జేసీ సోదరులకు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్న విభేదాలు పార్టీని ఎప్పుడో ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అదేవిధంగా కడప జిల్లాలో రామసుబ్బారెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలు ఎప్పటికప్పుడు బ్లాస్ట్‌ అవుతూనే ఉన్నాయి. గతంలో కేఈ వర్సెస్ భూమా వర్గంగా ఉండే కర్నూలు జిల్లాలో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం భూమా వర్గానికి శిల్పా వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రే స్వయంగా పంచాయితీ చేసినా ఇంకా చాపకింద నీరులా అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. ఇవి కేవలం ముఖ్య నేతల మధ్య వైరమే అనుకుంటే పొరపాటే ...ఎందుకంటే ఈ ప్రభావం జిల్లాలోని మారుమూల గ్రామాలవరకూ పాకిపోయింది..దీంతో రాజకీయ ప్రత్యర్ధులకు బలం కల్పించినట్లయింది.

 

ఓవరాల్‌గా చంద్రబాబుకు తమ్ముళ్ల తలనొప్పి ఎక్కువవుతోంది. బయట జరుగుతున్న రచ్చ కంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రచ్చే చంద్రబాబును మరింత ఆందోళనలోకి నెడుతోంది. పార్టీలో వలసల ప్రభావం, అంతర్గత కలహాలు, తమ్ముళ్ల బరితెగింపుతో పార్టీ ప్రతిష్టకు ముప్పు వాటిల్లుతుందనే భయం సైతం బాబును వెంటాడుతోంది.