చంద్రబాబు కోరిక తీరుతుందా? లేదా?


 


రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఏడాది దాటి పోయింది. కానీ కార్యాల‌యాల‌ను న‌వ్యాంధ్ర రాజ‌ధానికి త‌ర‌లించాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోరిక మాత్రం తీర‌డం లేదు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే రంగంలోకి దిగినా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే అన్నట్లుగా త‌యారైంది ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే కార్యాల‌యాల త‌ర‌లింపుపై నిర్ణ‌యం తీసుకున్నా...ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి మాత్రం సాధ్యంకావ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలున్నా... ప్ర‌ధానంగా ఏపీ రాజ‌ధాని ప్రాంతంలో స‌రైన మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డం... ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూప‌క‌పోవ‌డమేనంటున్నారు ఉన్న‌తాధికారులు.

అయితే స‌మ‌స్య‌ల‌ను షార్ట్ అవుట్ చేయ‌డానికి నాలుగు క‌మిటీల‌ను వేసిన ప్ర‌భుత్వం...స‌రైన నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. మొద‌ట్లో న‌లుగురు అధికారుల‌తో ఒక‌ క‌మిటీ...ఆ త‌ర్వాత ఇంజనీర్లతో మ‌రో క‌మిటీ వేసి ప‌క్క‌న‌పెట్టేశారు. మంత్రులు య‌న‌మ‌ల‌, నారాయ‌ణ‌ల‌ను రంగంలోకి దింపినా.. ఫ‌లితం లేక‌పోవ‌డంతో... ఫైన‌ల్ గా ఐదుగురు సీనియ‌ర్ అధికారుల‌తో మ‌రో క‌మిటీని వేసింది ప్రభుత్వం. అయినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేక‌పోవ‌డంతో...మ‌రోసారి చంద్ర‌బాబే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ఉద్యోగుల త‌ర‌లింపుపై ఉన్న‌తస్థాయి స‌మీక్ష జ‌రిపి....ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాలంటూ ఆదేశించారు. అయితే ఉద్యోగుల‌ను మాత్రం వేధింపుల‌కు గురిచేయొద్ద‌ని సూచించారు. ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చ‌డంతోపాటు, కార్యాల‌యాల త‌ర‌లింపుపై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు.

అయితే రాష్ట్ర ప‌రిస్థితిని, ఉద్యోగుల ఇబ్బందుల‌ను అర్థంచేసుకుని, అద్దెల విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హరించాల‌ని య‌జ‌మానుల‌కు బాబు విజ్ఞ‌ప్తిచేశారు. అయినా ఇంకా అనేక సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు ఉద్యోగులు. దాదాపు 20వేల ఉద్యోగులు హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి ఉంటుంద‌ని...వీరికి అవసరమైన గృహాలు, మౌలిక వ‌స‌తులు సమకూర్చాకే...త‌ర‌లించాలంటూ ప‌ట్టుబ‌డుతున్నారు. పైగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ మ‌ధ్య‌లో త‌ర‌లిస్తే... త‌మ పిల్లల చ‌దువులు ఏం కావాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తో సమానంగా హౌస్ అలవెన్స్, 371డి ఆర్టికల్ పై స్పష్టత వ‌చ్చాకే త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాలంటున్నారు ఉద్యోగులు. దాంతో చంద్ర‌బాబు ఆశిస్తున్నట్లుగా కార్యాల‌యాలు, ఉద్యోగుల త‌ర‌లింపు వేగం పుంజుకుంటుందా...లేదా అన్న అనుమానాలు రిపీట్ అవుతున్నాయి
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu