నందుల రచ్చపై స్పందించిన చంద్రబాబు..

 

నంది అవార్డులపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 2014, 15, 16 గాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు అవార్డులు రాలేదని.. అవార్డుల ప్రకటనలో కుల రాజకీయాలు జరిగాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఈ అవార్డులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి.. నంది అవార్డులపై అసలు ఇంత రచ్చ అవుతుందనుకోలేదు.. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవాళ్లం అని అన్నారు. అంతేకాదు.. ప్రతి విషయానికి ఇలా కులం రంగు పూయడం సరికాదు.. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని తెలిపారు.

 

ఇక ఇదే విషయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించి... కొంద‌రు హైద‌రాబాద్‌లో కూర్చొని ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారని అన్నారు. ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేని వారు కూడా ప్ర‌త్యేక హోదా, నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు. నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా బాధ‌ప‌డ్డార‌ని లోకేశ్ తెలిపారు