TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట : సీఎం చంద్రబాబు

Published on: Wed May 28, 2025 2:27PM

 

భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి  అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని కితాబునిచ్చారు. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని అన్నారు. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్పచారాలు చేస్తే సహించబోనని సీఎం తెలిపారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పంద్రాగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిసపారు. కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయని... కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. 

లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని అన్నారు. నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు. కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.