TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్..పంద్రాగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం

Published on: Sat May 17, 2025 5:40PM

 

ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోన్నారు. జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సభకు హాజరైన ప్రజలతో ప్రమాణం సీఎం చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. 

ప్రపంచం మెచ్చుకునేలా విశాఖలో యోగా డే ను నిర్వహించబోతున్నామని.. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తానే రైతు బజార్‌ లను ఏర్పాటు చేశానని అన్నారు. కర్నూలులోని రైతు బజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో రైతు బజార్‌లను పెడతామని అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర దిశగా అందరం ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదని.. అన్నీ ఏదో రూపంలో ఉపయోగపడుతాయని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని అన్నారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించానని తెలిపారు. చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు పని చేస్తున్నాయని అన్నారు. రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు వస్తున్నాయని తెలిపారు.