TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డప్పు కొట్టి గిరిజనులతో నృత్యం చేసిన సీఎం చంద్రబాబు..!

Published on: Sun Aug 9, 2026 2:55PM

 

విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజన సోదరులతో ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన ముఖ్యమంత్రికి గిరిజన విభాగాలు అపారమైన అభిమానంతో స్వాగతం పలికాయి. సాంప్రదాయ వస్తువులు, అలంకరణలతో సిద్ధమైన కళాకారులు తమ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా గిరిజనుల విలక్షణ సాంస్కృతిక రూపాలైన కొమ్ము నృత్యం, బంజారా నృత్యం మరియు ప్రసిద్ధ థింసా ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. కళాకారుల ఉత్సాహభరిత అడుగులు, వాయిద్యాల శబ్దాలు సభాప్రాంగణాన్ని హోరెత్తించాయి.కళాకారుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా డప్పు పట్టుకుని లయబద్ధంగా వాయించారు. అంతేకాకుండా, గిరిజన కళాకారులతో కలిసి సరదాగా అడుగులేస్తూ వారితో మమేకమయ్యారు. ముఖ్యమంత్రి ఉత్సాహం చూసి అక్కడ ఉన్న ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున ఈలలు, చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.


 ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.రాష్ట్రంలో దాదాపు 29 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, వారి విద్యా, వైద్యం, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు వివరించారు. గిరిజన యువతకు తగిన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, విశ్వవేదికపై ధింసా నృత్యం గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల ఆయన గర్వం వ్యక్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది ఐటీడీఏ (ITDA) కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేసి గిరిజన గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

అంతేకాకుండా 2027 డిసెంబరు నాటికి ఏజెన్సీలోని గిరిజనులందరికీ శాశ్వత గృహ నిర్మాణాలు పూర్తి చేసి, ఉచిత సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కీలక హామీ ఇచ్చారు.సాంకేతికతతో పాటు సమాజ వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి, రాష్ట్రానికి ఒక విజన్ ఉన్నట్లే ప్రతి కుటుంబానికి, గ్రామానికి విస్పష్టమైన లక్ష్యాలు ఉండాలని, విద్యార్థులు చదువు పూర్తి చేసి స్టార్టప్‌లు స్థాపించినా అది దేశసేవతో సమానమేనని వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రాధాన్య నిర్ణయాలపై గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా వేధిస్తున్న రోడ్లు, తాగునీరు, నెట్‌వర్క్ సమస్యలకు సీఎం తాజా ప్రకటనలతో త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం విధించుకున్న 2027 నాటి లక్ష్యాల సాధన ద్వారా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు సామాజికంగా, ఆర్థికంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సరైన కనెక్టివిటీ, సొంతిళ్లు, ఉపాధి అవకాశాలు లభిస్తే గిరిజన ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశిస్తున్నారు.

CM Chandrababu, World Tribal Day, Vijayawada tribal celebrations, Thinsa dance, Andhra Pradesh government