TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీ : సీఎం చంద్రబాబు

Published on: Thu Jul 23, 2026 6:49PM

 

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే ఉద్దేశంతో ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రత్యేకతలు, పనితీరును సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించి, ట్యాంపర్ ప్రూఫ్ భద్రతతో లావాదేవీలు జరిగే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు వివరించారు.

భూ వివాదాలకు ప్రధాన కారణాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు ఒకటని, ఇకపై ఇలాంటి సమస్యలను నివారించేలా బ్లాక్‌చెయిన్ విధానం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ వ్యవస్థను రూపొందించామని, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్‌లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల పరిధిలోని 89 రీ-సర్వే గ్రామాల్లో 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురానున్నారు.‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ అమలు విధానాన్ని వివరిస్తూ అధికారులు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్తులో క్యూ ఆర్ కోడ్, ఆధార్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అధ్యయనం చేసి లోపాలను సరిదిద్దాలి

పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...“భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో భూ వివాదాలు తక్కువగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలోనూ భూ తగాదాలు పెరిగాయి. 22ఏ పేరుతో కక్ష సాధింపు చర్యలు జరిగాయి.ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే అంశాల ఆధారంగా భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నాం. రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. పట్టాదార్ పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తున్నాం.

శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్న భూములకు విముక్తి కల్పించాం. ప్రస్తుతం ప్రారంభించిన ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ ప్రాజెక్టు ద్వారా భూములకు శాశ్వత భద్రత కల్పిస్తాం.
భూ రికార్డులకు ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థను తీసుకొస్తున్నాం. బ్లాక్‌చెయిన్ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదికపైకి వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయవిక్రయాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టు అమలును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. లోటుపాట్లు గుర్తించేందుకు ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి, అవసరమైన మార్పులు చేర్పులు చేయాలి. ఇకపై సర్వే పూర్తయిన గ్రామాలను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వ్యవస్థలోకి తీసుకురావాలి. నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

భూ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపడమే మా లక్ష్యం. భూ సమస్యలు తగ్గితే ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది.” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, ఏడు జిల్లాల కలెక్టర్లు, ఏపీ-ఎన్ఐసీ, బెంగళూరు-ఎన్ఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

CM Chandrababu, AP Blockchain Land Records, Mee Bhoomi Blockchain, Andhra Pradesh Land Fraud Prevention, Tamper Proof Land Records, NIC Blockchain Technology, Minister Satya Prasad