TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి : సీఎం చంద్రబాబు

Published on: Mon Oct 27, 2025 7:11PM

 

మొంథా తుఫాన్ ముప్పు ఉన్న తీరప్రాంత ప్రజలను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. 

సోమవారం ఉదయం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుఫాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలని చెప్పిన సీఎం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. 

తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు నిర్దేశించారు. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. 

కొండచరియలు జారిపడకుండా జాగ్రత్తలు

మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని చెప్పిన ముఖ్యమంత్రి... వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని... అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎంకు వివరించారు. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందని... ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు