TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొంథా తుపాను ఎఫెక్ట్... పలు రైళ్లు రద్దు

Published on: Mon Oct 27, 2025 2:43PM

 

మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ మీద ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 43 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే ఉదయం నుంచి ఏపీలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మొంథా తుఫాన్ పరిస్థితిపై  ప్రధాని మోదీ ఆరా తీశారు. చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాను పరిస్థితిని తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయిలో  సహకరిస్తుందని ప్రధాని భరోసానిచ్చారు. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం మొంథా తుపాను కాకినాడకు సుమారు 680 కిలోమీటర్ల దూరంలో వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో ఈ రోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి గంటకు తుపాను కదలికలను పర్యవేక్షిస్తూ, వర్షాలు, వరదల ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను బలపరచాలని స్పష్టం చేశారు.