TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొంథా తుఫాన్ ఎఫెక్ట్...స్కూళ్లకు సెలవులు

Published on: Sat Oct 25, 2025 7:52PM

 

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 27,28,29 తేదీల్లో సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న హాలిడే ఇచ్చారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ "తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు  అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. 

రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి" అని స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రి సిద్ధంకాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు.