శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి : సీఎం చంద్రబాబు
Published on: Sun Oct 5, 2025 5:37PM
.webp)
శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలోనే అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీశైల క్షేత్రంలో వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసిన దివ్యక్షేత్రంగా శ్రీశైలం గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణపై చర్చించారు.
ఏటా లక్షలాది భక్తులు శ్రీశైలాన్ని సందర్శిస్తున్నందున, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. తిరుమల నమూనాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ దృక్కోణాల్లో శ్రీశైలం ప్రాంత అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. దేవాలయ విస్తరణ కోసం సుమారు 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా, శ్రీశైలాన్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య సంవత్సరానికొకసారి పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధికి వేగవంతమైన చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యాల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. శబరిమల వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వాటి తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.


