ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు
Published on: Thu Aug 28, 2025 6:29PM

ఏపీలో ప్రతీ కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామ్లీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి.
ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. దీని కోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చడంతో పాటు... పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా... కుటుంబంలో ఎంత మంది ఉంటే.. వారందరికీ ఆ కార్డును ఇస్తే.. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి.” అని సీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


