సియం కూర్చీపై నాలుగో కృష్ణుడు..?

 

తెలంగాణ ఏర్పాటు ప్రకటన కొరివితో తలగొక్కున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో పడినట్టుగా సమాచారం.. ఇన్నాళ్లు ఎట్టి పరిస్థితుల్లో సియం ను మార్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన కేంద్ర ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డిని సాగనంపడానికి సిద్దమవుతుందట.

 

అందులో భాగంగానే సియం పీఠం మీద కన్నేసిన ఓ కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్థుతం జరుగుతున్న సీమాంద్ర ఉద్యమాన్ని తెగవాడేసుకుంటున్నాడని కాంగ్రెస్‌ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏళిన ఏ సామాజిక వర్గం సొంత కుంపటి పెట్టేసుకోవటంతో ఇక రాష్ట్ర కాంగ్రెస్‌కు తామే పెద్ద దిక్కు కావాలని భావిస్తున్నాడట సదరు నేత.

 

అందులో భాగంగానే తన ఆస్తులను తానే పగలగొట్టేసుకొని, తగలబెట్టేసుకొని అధిష్టానం మెప్పుపొందటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడట. అంతే కదా మరి చీమ కూడా చొరబడలేని దొరవారి కోటలో ఆయన ఆస్తుల మీద చేయి వేసే ధైర్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది, రాళ్లేది ఆయనే, వేయించుకునేది ఆయనే, నవ్వేది ఆయనే, ఏడ్చేదీ ఆయనే అనుకుంటున్నారు అంతా.

 

తెలంగాణ సమస్య తొలినుంచే అధిష్టానం మాటకు జీహుజూర్‌ అంటూ వచ్చిన సదరు నేత రాష్ట్ర విభజన తరువాత కాస్త అటు ఇటుగా మాట్లాడినా అధిష్టానానికి మాత్రం ఎదురు మాట్లాడలేదు. అందుకే అమ్మ ముందు చూపించిన విధేయతతో పాటు ఆస్తులు నష్టపోయాడనే సింపతీతో సియం సీటుకు టెండర్‌ వేశాడా నాయకుడు.. మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ సియంను మారుస్తుందా.. ఏమో అది కాంగ్రెస్‌ పార్టీ అందులో ఏం జరిగే అవకాశమైనా ఉంది.