TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్ఎంసీ ఘటనపై సీఎం సీరియస్... నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

Published on: Fri Jul 11, 2025 2:04PM

కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్‌ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి వాట్సాప్‌లకు పంపించేవాడని, రూమ్‌కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగగా.. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని విద్యార్థి నులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ విద్యార్థినులపై లైంగిక వేధింపులపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు చంద్రబాబుకు ఈ ఘటనకు సంబంధించి అంతర్గత విచారణలో తేలిన అంశాలతో నివేదిక సమర్పించారు.  

మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు.  విద్యార్థినులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్దం చేసింది. చక్రవర్తితోపాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాల కృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ నలుగురిపై పోలీసు కేసు నమోదు చేశారు.