మూడేళ్ళ పాలనలో రాజకీయ ఏకాకిగా మారిన కిరణ్

 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి నేటికి మూడేళ్ళు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ అయిన రోశయ్య చేతులెత్తేసిన తరువాత ఎవరూ ఊహించని విధంగా ఆయనను అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో భాద్యతలు చెప్పటిన అయనపై అటు అధిష్టానం, ఇటు ప్రజలూ కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ నాటి నుండి నేటి వరకూ కూడా ఆయనకు నిత్యం గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. అధిష్టానం దయతో ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పుడు అదే అధిష్టానం ఆగ్రహానికి గురయి ఏ క్షణంలోనయినా పదవి పోగొట్టుకొనేలా ఉన్నారు.

 

సీనియర్ కాంగ్రెస్ నేతలకి ఆయన తన మంత్రి వర్గంలో అప్రదాన్యమయిన మంత్రి పదవులు కేటాయించడంతోనే అసమ్మతినే మొదలయింది. తెలంగాణా ఉద్యమాల వలన ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణంగా ఆయన ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టలేకపోయింది. బహుశః అందుకే ఆయన తనకు రాజకీయంగా ప్రయోజనం కల్పించే సంక్షేమ పధకాలకే పెద్దపీట వేసారు.

 

కానీ, తన మంత్రులెవరినీ సంప్రదించకుండా, వాటి ద్వారా కేవలం తను ఒక్కడే పేరు సంపాదించుకోవాలని ప్రయత్నించడంతో సహజంగానే మంత్రివర్గంలో తీవ్ర వ్యతిరేఖత ఎదురయింది. ఆ తరువాత విద్యుత్ చార్జీలు, సర్ చార్జీల పెంపు విషయంలో ఆయన అనుసరించిన ఒంటెత్తు పోకడలకి ఆయన పట్ల మంత్రి వర్గంలో వ్యతిరేఖత పెరిగింది. సీబీఐ చార్జ్ షీట్లలో పేరేక్కిన ధర్మాన, సబితా రెడ్డిలను కాపాడే ప్రయత్నంలో ఆయన ప్రతిష్టమరింత మసకబారింది. అంతే గాక తన నిర్ణయాన్ని వ్యతిరేఖించినందుకు డీయల్ రవీంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించడంతో ఆయన పూర్తి నిరంకుశదోరణికి బయటపెట్టుకొన్నారు.

 

ఇక సకలజనుల సమ్మెలో ఆయన టీ-కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేయించడం, తెలంగాణాని వ్యతిరేఖిస్తూ ఆయన చేస్తున్నవాదనలతో తెలంగాణా కాంగ్రెస్ నేతలకు, అధిష్టానానికి కూడా బద్ద శత్రువుగా మారిపోయారు. అయితే అందుకు ప్రతిఫలంగా సమైక్యవాదిగా సీమాంధ్ర ప్రజలలో కొంత పేరు సంపాదించుకొన్నపటికీ, ఈ విషయంలో కూడా మొత్తం క్రెడిట్ తను ఒక్కరే స్వంతం చేసుకోవాలని ప్రయత్నించడంతో ఏ కొద్దిమందో తప్ప సీమాంధ్ర నేతలు కూడా ఆయనకి దూరమవడంతో రాష్ట్ర రాజకీయాలలో దాదాపు ఏకాకిగా మారారు.

 

ఎన్నోఅంచనాల నడుమ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పటిన కిరణ్ కుమార్ రెడ్డి, స్వంత పార్టీని కానీ, రాష్ట్ర నేతలని గానీ, ప్రజలని గానీ మెప్పించలేకపోయారు. తను చేస్తున్నసమైక్యవాదం, తను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తనని ఆదుకొంటాయని ఆయన ఆశిస్తున్నట్లున్నారు.

 

అయితే ఈ మూడేళ్ళలో ప్రభుత్వ అసమర్ధత కారణం వల్లనయితేనేమి, ఉద్యమాల వల్లనయితేనేమి రాష్ట్రంలో పెరిగిన అరాచకం, అనిశ్చితి, అధిక ధరలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజానీకం ఆయన వేరే కొత్త పార్టీ పెట్టుకొని వచ్చినా బహుశః ఆదరించక పోవచ్చును.

 

ఇంతకంటే చాలా క్లిష్టమయిన పరిస్థితుల్లో అయన లాగే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవి చేప్పటిన స్వర్గీయ పీవీ నరసింహరావుగారు కత్తి మీద సామువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా అనేక క్లిష్ట పరిస్థితులలో ఏవిధంగా నెగ్గుకొచ్చారో గమనిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఘోరంగా వైఫల్యం చెందారో మరింత స్పష్టంగా అర్ధం అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయాచితంగా ఒక అపూర్వ అవకాశం దొరికినప్పటికీ దానిని సమర్ధంగా వినియోగించుకోలేకపోయరని చెప్పవచ్చును. .