జగన్ తో కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ ?

 

జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు అవడంతో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనం కలిగిస్తోంది. అతని విడుదలతో రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయనే అంశంపై చాలా లోతుగా విశ్లేషణ జరుగుతోంది. వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఎన్నికల పొత్తులకు సిద్దపడినందునే నేడు అతనికి బెయిలుకు మంజూరయిందని వాదనలు వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విడుదలతో కేవలం తెదేపా మాత్రమే చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ నేతలలో కూడా చాలా కలవరం ఉంది. ముఖ్యంగా అధిష్టానం నిర్ణయాన్నిసవాలు చేస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలపై జగన్ విడుదల ప్రభావం ఉంటుందా లేదా?అనే ప్రశ్న తలెత్తుతోంది.

 

“సమయం చూసి అందరూ ఒకేసారి రాజీనామాలు చేద్దామని” ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు చెప్పినట్లు అమలాపురం యంపీ హర్షకుమార్ ఈ రోజు మరో మారు స్పష్టం చేసారు. అంటే శాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజునే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఒక తీవ్ర నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపబోతోందనే సంగతిని ముందుగా గ్రహించినందునే రాష్ట్రవిభజన అంశాన్నిఅడ్డుపెట్టుకొని పార్టీని వీడిపోతామని సవాలు విసురుతున్నారా? లేక నిజంగానే విభజనను వ్యతిరేఖిస్తూ ఆవిధంగా వ్యవహరిస్తున్నారా? అనే సంగతి వారి తదుపరి ప్రతిక్రియలను బట్టి తేలిపోతుంది.

 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే జగన్ బాబును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడమే తమ ఏకైక లక్ష్యమని విజయమ్మతో సహా వైకాపా నేతలందరూ చాలా స్పష్టంగా చెపుతున్నారు. ఇంతకాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనను కాదని ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంకనెత్తుకోదలిస్తే, మరి ఆయన అధిష్టానం పట్ల అదే విదేయత కనబరుస్తారా లేక మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వేరే కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీస్తారా? అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని సవాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉపేక్షిస్తుందా లేక కేంద్రంలో అధికారం చేజిక్కించుకొనేందుకు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి, పార్టీకి అత్యంత విధేయుడు, విశ్వసనీయుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కనపెడుతుందా?వంటి అనేక ధర్మ సందేహాలకు సమాధానాలు ఎన్నికల ప్రకటన వెలువడక ముందే తేలిపోవచ్చును.