TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్ -బొత్సల మధ్య తారస్థాయికి ఆధిపత్య పోరు

Published on: Thu Feb 23, 2012 8:55AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య ఆధిపపత్య పోరు తారస్థాయికి చేరింది. అవకాశం లభించినపుడల్లా ఇద్దరు నేతలు అధిష్ఠానవర్గానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండగా వారి అనుకూలురు కూడా ఆదే బాట పడుతున్నారు. పార్టీపరంగా బొత్స తీసుకునే నిర్ణయాలను ముఖ్యమంత్రి అధిష్ఠానం వద్ద అడ్డుకుంటుండగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు అధిష్ఠానం వద్ద బొత్స అడ్డుకుంటున్నారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రెండు రోజులుగా శాసనసభ లాబీల్లో ఇద్దరు నేతల అనుకూలురు తమ ప్రచార స్థాయిని పెంచారు. పిసిసి అధ్యక్షుడుగా బొత్సను తొలగించి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఆ పదవిని ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి అనుకూలురు ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రతిగా అసెంబ్లీ సమావేశాల తర్వాతనో, ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనో ముఖ్యమంత్రిని మార్చడం ఖాయమని బొత్స అనుకూలురు ప్రచారం చేస్తున్నారు.


సమాచార హక్కు కమిషనర్ల జాబితాలో సగం మందిని గవర్నర్ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి, పిసిసి నేత మధ్య నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఉప ఎన్నికల అభ్యర్థుల మార్పు విషయంలో కూడా బొత్స ప్రమేయం ఉండి ఉండవచ్చన్న అనుమానాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న ఏడు స్థానాలకుగాను ఆరు స్థానాల్లో ఎదురీదే పరిస్థితి ఉందని, మహబూబ్‌నగర్ టిక్కెట్టును దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి భార్య విజయలక్ష్మికి ఇచ్చినట్లయితే సానుభూతి ఓట్లతో కొద్దిగా గట్టెక్కే పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం, అయితే అధిష్ఠానవర్గం మాత్రం ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్‌కు ఇచ్చింది. మహబూబ్‌నగర్ అభ్యర్థి మార్పు విషయంలో బొత్స హస్తం ఉండి ఉండవచ్చని ముఖ్యమంత్రి సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మహబూబ్‌నగర్ టిక్కెట్టు విజయలక్ష్మికే దక్కేలా ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.


కాగా, పిసిసి కార్యవర్గాన్ని, డిసిసి అధ్యక్షుల్ని నియమించేందుకు బొత్స నిర్ణయించగా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని పిసిసి నేత సన్నిహితులు చెబుతున్నారు. సగం మంది డిసిసి అధ్యక్షుల్ని ఎంపిక చేసి అధిష్ఠానవర్గం ఆమోదంతో ప్రకటించేందుకు బొత్స సిద్ధపడగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధిష్ఠానంతో చెప్పి అడ్డుకున్నారని బొత్స సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి నేతల వైఖరి పట్ల కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇద్దరి వ్యవహార శైలి పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.