TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్

Published on: Wed Feb 22, 2012 9:27AM

హైదరాబాద్: సీఎం కిరణ్‌కు ఏమాత్రం సిగ్గున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను తప్పించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. రూ.20కి అమ్మాల్సిన చీప్ లిక్కర్‌ను రూ.100కు అమ్ముతున్నారు. "పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు. ఒక వ్యక్తికి ఒకే షాపు ఉండాలని నిబంధనలు చెబుతుంటే వాటిని తుంగలో తొక్కి అనేక షాపులు తీసుకొని సిండికేట్లు నెలకొల్పారు. రాజకీయ నాయకులు, అధికారులు ఏటా ఐదు నుంచి పది వేల కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. వీటిని అదుపు చేయాల్సిన మంత్రి తానే సిండికేట్ల నుంచి ముడుపులు పుచ్చుకొంటున్నారు. దాడులు జరిపి ఏసీబీ తయారు చేసిన జాబితాను తక్షణం బహిర్గతం చేయాలి.'' అని డిమాండ్ చేశారు.

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. "తప్పుడు పనులు చేసి తప్పించుకోలేరని రుజువైంది. ప్రజల దృష్టిలో సమాచార కమిషనర్ల ఎంపికలు సరిగా లేవని, సెర్చి కమిటీ ద్వారా సవ్యంగా ఎంపికలు జరపాలని నేను రాసి పంపినా పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇప్పుడు గవర్నర్ తిరస్కరణ. పోలవరం టెండర్లలోనూ ఇలాగే అడ్డగోలుగా చేద్దామని ప్రయత్నించారు. దొంగ సొత్తు దొరికింది. కానీ దొంగలు పట్టుబడలేదు. వారిని కూడా పట్టుకోవడానికే స్పీకర్ ముందు ఫైళ్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం'' అని చెప్పారు. టీడీపీలో పుట్టి పెరిగి పదవులు పొందిన కేసీఆర్ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. తాను వస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే వస్తానని, తన అనుభవం రాష్ట్రాభివృద్ధికే ఉపయోగపడాలని కోరుకొంటున్నానని చెప్పారు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రభుత్వం పారిపోతోందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీయేతో కలిసే సమస్యే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.